calender_icon.png 29 September, 2024 | 3:49 AM

కశ్మీర్‌లో బీజేపీ జెండా ఎగరేస్తాం

29-09-2024 01:40:45 AM

  1. విజయదశమి నాటికే ఆ శుభవార్త వింటారు
  2. శ్రీనగర్‌లో ఎన్నికల ప్రచారం ప్రధాని నరేంద్రమోదీ

శ్రీనగర్, సెప్టెంబర్ 28: జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, విజయదశమి నాటికే ఆ శుభవార్తను ప్రజలు వింటారని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శనివారం శ్రీనగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని.. కాంగ్రెస్, ఎన్సీపీ, పీడీపీ ఈ మూడు కుటుంబ పార్టీలతో జమ్మూ ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. అవినీతి, ఉద్యోగాల్లో వివక్షను ఇక్కడి ప్రజలు పారదోలాలని భావిస్తున్నారన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతానికి దూరంగా ఉండాలని వారు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.

దేశంకోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల విలువ కాంగ్రెస్‌కు తెలియదంటూ ఆ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సరిహద్దుల్లో కాల్పులు జరిగితే  ఆ పార్టీ తెల్లజెండాలను ఎగురవేసింది. బీజేపీ అధికారం చేపట్టాక మన దేశం జోలికి వచ్చే ఉగ్రవాదులపై ఎదురుకాల్పులకు దిగుతున్నాం.

2016, సెప్టెంబర్ 28న శత్రు దేశం భూభాగంలోకి చొచ్చుకొని వెళ్లి ఉగ్రవాదులపై దాడి చేశాం. దీంతో నవ భారత్ సత్తా ప్రపంచానికి తెలిసింది. దేశ రక్షణ కోసం జవాన్లు చేసిన త్యాగం విలువ ఆ పార్టీకి తెలియదు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ సైనికులకు మాయమాటలు చెప్పి మోసం చేసింది. వన్‌ర్యాంక్, వన్ పెన్షన్ ఇస్తామంటూ వారిని ఎదురుచూసేలా చేసింది’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.