calender_icon.png 24 November, 2024 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తాం

24-11-2024 01:56:43 AM

  1. మేము ఇండియా కూటమిలో భాగమే..
  2. అయినప్పటికీ సర్కార్ తప్పులను ఎత్తిచూపుతాం
  3. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవలేదు.. బీఆర్‌ఎస్ ఓడింది..
  4. ఫోర్త్‌సిటీ, ఫార్మా, లగచర్ల ఘటనపై అఖిలపక్ష సమావేశం ఏదీ?
  5. దేశానికిప్పుడు కమ్యూనిస్టుల అవసరం ఉంది
  6. 26న కమ్యూనిస్టుల ఐక్య వైదికపై కీలక ప్రకటన చేస్తాం
  7. విజయక్రాంతి’ ఇంటర్వ్యూ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ‘లగచర్లలో భూసేకరణ విషయంలో రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లినట్లు కనిపించడం లేదు. నోటిఫికేషన్ ఇవ్వకముందే ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కానీ, అలా జరగలేదు.

ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ పెట్టకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ‘విజయక్రాంతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక కీలకమైన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులనూ ఎత్తిచూపుతామని ఆయన స్పష్టం చేశారు.

లగచర్లలో గ్రామస్తులు అధికారులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. మరోవైపు రైతుల న్యాయమైన డిమాండ్లను సర్కార్ పరిష్కరించాలని కోరారు. లగచర్లలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు వామపక్షాలతో కలిసి గ్రామంలో పర్యటించి, రాష్ట్రప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు.

 ప్రాజెక్టులకు సీపీఎం వ్యతిరేకమా?

మేం ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదు. ప్రాజెక్టులు కట్టాలన్నా.. పరిశ్రమలు స్థాపించాలన్నా భూ సమీకరణ అనివార్యం. కానీ, పంటలు పండే భూములను పరిశ్రమలకు ఉపయోగిస్తే దీర్ఘకాలంలో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లక్షల ఎకరాలు పరిశ్రమలకు ఆవాసాలుగా మారుతున్నాయి.

దీని వల్ల అటు రైతులు నష్టపోతారు.. ఇటు దేశమూ నష్టపోతుంది. అందుకే సాగు భూముల్లో ఫ్యాక్టరీల ఏర్పాటును సీపీఏం వ్యతిరేకిస్తోంది. ఒకవేళ పంటలు పండే భూములను తీసుకోవాల్సి వస్తే 2013లో వచ్చిన భూసేకరణ చట్టం ప్రకారం.. మార్కెట్ ధరకు మూడింతలు చెల్లించాలి. లగచర్లలోనూ అదే పాటించాలి.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదని మీరెందుకు అనాల్సి వచ్చింది?

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు.. బీఆర్‌ఎస్ ఓడిపోయిందంతే. మేం జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నాం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. రాష్ట్రానికిప్పుడు బీజేపీ ప్రమాదం పొంచి ఉంది. తాము కాంగ్రెస్‌ను బలహీనం పరచడమంటే, బీజేపీని బలపరచడమే అవుతుంది. మేం సీఎం రేవంత్‌రెడ్డి తప్పులను మాత్రమే ఎత్తిచూపుతాం.

పాలనకు ఏడాది పూర్తయినందున ఇక ఎత్తిచూపుతాం. ప్రభుత్వం ఎలాంటి చర్చలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం లేదని నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఆ ప్రజాస్వామ్యం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదన్న అనుమానం ప్రజల్లో మొదలైంది.

ఆ అపవాదును కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టు కోకూడదు. సర్కార్‌లో ఎలాంటి కల్మషం లేనప్పుడు అఖిలపక్ష మీటింగ్ ఎందుకు పెట్టడం లేదు. లగచర్లలో భూసేకరణ విషయంలోనూ సర్కార్ రైతుల సమస్యలతో పాటు కాలుష్యం, ప్రజారోగ్యం వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అవన్నీ జరగలేదు కాబట్టి మేం ఆ మాట అనాల్సి వచ్చింది.

ఫార్మా సిటీకి, ఫోర్త్ సిటీకి మధ్య ఏం తేడాను గమనించారు?

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మా సిటీకి, కాంగ్రెస్ ప్రకటించిన ఫోర్త్ సిటీకి నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ఫోర్త్ సిటీ, ఫార్మాసిటీ, హైడ్రా, మూసీ వంటి పాలసీపై చర్చించేందుకు సర్కార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, శ్వేతపత్రం విడుదల చేయాలి.  ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి ఉండాల్సింది. కానీ, సర్కార్ ఆ పని చేయలేదు.

గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేస్, కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కుంభకోణాలు జరిగాయని నమ్ముతున్నారా?

అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో పాలకులు అడ్డదిడ్డంగా సంపాదించడం దేశానికి కొత్తేమీ కాదు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పాలకులు అదే చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పగ్గాలు చేపట్టిన బీఆర్‌ఎస్ కూడా చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమూ అదే దారిలో వెళ్తున్నది. అయితే.. స్కాంల వెనుక నిజానిజాలు తేల్చేది మాత్రం చట్టాలు, న్యాయస్థానాలే.

మూసీ పునరుజ్జీవంపై సీపీఎం వైఖరి ఏంటి? 

మూసీ ప్రక్షాళనకు సీపీఎం మద్దతు ఇచ్చింది. కానీ పేదలకు నష్టం జరిగితే సహించబోం. మూసీ ప్రక్షాళన జరగాలంటే ముందు ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను నదిలో కలవకుండా చూడాలి. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అలాగే గుడిసెలు తొలగిస్తే మూసీ ప్రక్షాళన కాదు. ఇళ్లు కోల్పోతున్న వారికి సర్కార్ నష్ట పరిహారం ఇవ్వాలి. 

కమ్యూనిస్ట్ పార్టీల ఏకీకరణ ఎంతవరకు వచ్చింది?

కమ్యూనిస్టుల ఐక్యతపై ప్రజల్లో సానుకూలత ఉంది. మా పార్టీ సైతం ఏకీకరణను కోరుకుంటున్నది. అయితే కమ్యూనిస్టుల మధ్య అనైక్యత ఎందుకు వచ్చిందనే అంశంపై ఇప్పుడు చర్చ జరగాలి. ముందు కమ్యునిస్టు పార్టీల ప్రజాసంఘాల ఐక్యవేదికను ఏర్పాటు చేయబోతున్నాం. అన్ని పార్టీలతో చర్చలు ముగిశాయి. ఈ నెల 26న సీపీఐతో చర్చలు జరగనున్నాయి. అదే రోజు ఐక్యవేదికపై కీలక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

కమ్యూనిస్టుల అవసరం సమకాలిన రాజకీయాల్లో ఉందంటారా? 

కమ్యూనిస్టులను రెండు కళ్లతో చూడాలి. పార్లమెంట్ దృక్పథం ఒకటైతే.. ఉద్యమ కోణం రెండోది. పార్లమెంట్ పరంగా చూస్తే కమ్యూనిస్టులు గతంలో కంటే బలహీనంగా ఉన్నారన్నది వాస్తవం. కానీ, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా  కమ్యూస్టుల అవసరం ఇప్పుడు దేశానికి ఉంది. ఇదే సమయంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేం బలహీనపడ్డాం. కానీ ఉద్యమపరంగా  చూస్తే సమస్య ను అర్థం చేసుకోవడం, పోరాటం చేయడంలో కమ్యూనిస్టులు ఎప్పు డూ ముందే ఉన్నారు.