కలెక్టర్ వెంకటేష్ ధోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు తోడ్పాటున అందిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో స్వయం సహాయక సంఘాలకు మంజూరైన 25 కోట్ల 4 లక్షల రూపాయల రుణ వితరణ చెక్కును మంచిర్యాల, ఆదిలాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్లు మురళీ మనోహర్ రావు, ప్రభుదాస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావుతో కలిసి జిల్లా మహిళా సమాఖ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తూ రుణ సౌకర్యాన్ని కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన పొందాలని తెలిపారు. గత 7 రోజులుగా సెర్ప్ సిబ్బంది, వి.ఎ.ఓ.లు, సి.సి.లు, ఎ.పి.ఎం.లు అహర్నిశలు కృషి చేసి బ్యాంకు లింకేజీ ప్రక్రియను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. మహిళా సంఘాలు బ్యాంకులు అందించిన రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
పిల్లలను చదివించి వారి ఉజ్వల భవిష్యత్తును మెరుగుపరచాలని తెలిపారు. తీసుకున్న రుణాలను తిరిగి క్రమం తప్పకుండా చెల్లించాలని, బ్యాంకులకు ఎలాంటి బాకీ లేకుండా చెల్లింపులు జరపాలని తెలిపారు. సుమారుగా 22 కోట్ల రూపాయలు తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారు రుణాలు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పోర్తేటి శ్రీదేవి ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనడం మహిళా సంఘాలకే కాకుండా జిల్లాకు గర్వకారణమని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని, ప్రతి గ్రూపు 20 లక్షల రుణాన్ని తీసుకునే స్థాయికి ఎదగాలని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెంది మరింత మందికి ఆదర్శంగా నిలువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.పి.ఎం. రామకృష్ణ, డి.ఆర్.పి.లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి, సంబంధిత అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.