28-02-2025 01:22:20 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి కావల్సిన నిధులు సమకూరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీని ఆయన సం దర్శించారు. విద్యార్థినులకు కావాల్సిన తరగతి గదులు, ల్యాబ్స్, లైబ్రరీలు, అధ్యాప కులకు కావాల్సిన వసతి గృహాలు, వీసీ కార్యాలయం, అతిథి గృహం, ఆడిటోరియం, పరిపాలన భవనాలకు సంబంధించిన ప్రదేశాలను పరిశీలించి, వాటి నమూనాలను ఆయన పరిశీలించారు.
1779-1947 మధ్య హైదరాబాద్‌లో పని చేసిన బ్రిటీష్ రెసిడెంట్లకు సంబంధించిన చిత్రపటాలను పరిశీ లించారు. విద్యాశాఖ అధికారుల సమక్షంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇంజనీరింగ్ అధికారులు ఆయనకు చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు ఆ యూనివర్సిటీ ప్రాంగణంలోని హెరిటేజ్ భవనాల పరిరక్షణతో పాటు పునరుద్ధరణకు నిధులు ఇస్తామని తెలిపారు.
దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆయనవెంట విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారానా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ పూజారి గౌతమి, తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ గణపతిరెడ్డి, యూనివర్సి టీ ఇన్‌చార్జి వైస్ ఛాన్స్‌లర్ సూర్య ధనంజయ్, ప్రిన్సిపాల్ లోక పావని ఉన్నారు.