calender_icon.png 18 October, 2024 | 11:54 AM

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

18-10-2024 12:25:14 AM

  1. రాష్ట్రంలో కొత్తగా 1500 బస్సులు కొనుగోలు చేస్తాం
  2. మంత్రి పొన్నం ప్రభాకర్

సంగారెడ్డి, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 1500 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం జహీరాబాద్‌లో ఎంపీ సురేశ్ షెట్కార్ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.

రాష్ట్రంలోని అన్ని డిపోలకు కొత్త బస్సులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. జహీరాబాద్ డిపోకు కొత్తగా 10 బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం లో గురుకుల విద్యార్థులకు నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే గురుకుల భవనాల యజ మానులపై చర్యలు తీసుకుంటుమన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, నాయకుడు ఉజ్వల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గత ప్రభుత్వ తీరుతోనే ఆర్థిక సంక్షోభం

సిద్దిపేట: గత ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఇటీవల నియామకమైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడెం లింగామూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమం  సిద్దిపేటలోని విపంచి కళా నిలయంలో ఏర్పాటు చేయగా మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో రాష్ట్రంలో ఒకే వ్యక్తి చేతిలో పాలన ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన సాగుతోందని చెప్పారు.

రాష్ట్రంలో గురుకుల పాఠశాల భవనాలకు గత ప్రభుత్వం 40 నెలలుగా అద్దె, 3 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇప్పుడు ఆరోపించడం సిగ్గు చేటన్నారు. గురుకుల భవనాల యజమానులు అద్దె బిల్లులు ఇవ్వాలని అడగడంలో తప్పులేదని, గత ప్రభుత్వం చేసిన తప్పుకు ఇప్పుడు భవనాలకు తాళాలు వేయడం సరికాదన్నారు.

మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నా బాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారని, తిరిగి కరీంనగర్‌లో కలిపేటప్పుడు ఎవరు అడ్డుపడినా ఆగదని అన్నారు.

సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలలో రెండో దశలో సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, పీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం, హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.