- అన్యాక్రాంతమైన భూములను కాపాడతాం
- పేదప్రజలకు పంచిపెడతాం
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం..
- భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం
సీఎం తర్వాత నేను నంబర్-2 అనే ప్రచారం నిజం కాదు.
‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
* 2014కు ముందు రెవెన్యూ రికార్డులన్నింటినీ రెవెన్యూశాఖ జల్లెడ పడుతున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు జీవో 59ని తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఒక్క హైదరాబాద్‌లోనే 18- 19 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్‌ఎస్ నేతలకు కట్టబెట్టింది. ఆ భూములను మా ప్రభుత్వం ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చింది.
* రైతుబంధు పథకంలో దండిగా అక్రమాలు జరిగాయి. భూమి తక్కువగా ఉన్నవారు కూడా పట్టా పాస్‌పుస్తకాల్లో ఎక్కువ భూమి చూపించారు. ప్రజల సొమ్మును పథకం ద్వారా కాజేశారు. ధరణి పోర్టల్‌తో రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరతరాల నుంచి భూములు సాగుచేసుకుంటున్న వారు భూములు కోల్పోయారు. పోర్టల్ సృష్టించిన తప్పులతో రైతులు అవసరానికి భూములు అమ్ముకోలేకపోయారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోయారు. మా ప్రభుత్వం ధరణి సమస్యలను సమీక్షించింది.
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కోటా ఉండదు. అత్యంత పేదలు, వితంతువులు, దివ్యాంగులు, పారిశుధ్య కార్మికులకు తొలి ప్రాధాన్యం.
‘బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని దేవాదాయ, అటవీ, వక్ఫ్‌తో పాటు ఇతరశాఖలకు చెందిన ప్రభుత్వం భూములను నాటి పాలకులు తమ అనుచరులు, బంధుగణానికి పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు. బీఆర్‌ఎస్ పెద్దలు, వారి అనుచరులు అక్రమంగా పట్టాలు పొందిన సర్కార్ భూముల లెక్కలు తీస్తాం. వాటిని
భూములను స్వాధీనం చేసుకుంటాం. పేదల ప్రజలకు పంచిపెడతాం. అక్రమార్కుల లెక్కలు సైతం తేలుస్తాం’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన ప్రత్యేకంగా ‘విజయక్రాంతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఆయన మాటల్లోనే..
హైదరాబాద్, విజయక్రాంతి :
పేదప్రజలకు పంచిపెడతాం
- అక్రమార్కుల లెక్కలు తేలుస్తాం.. చట్టపరంగా చర్యలు
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం..
- భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం
- రెవెన్యూ, హౌసింగ్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్లు..
కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలోని 14 గ్రామాల్లో పెలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వ భూములపై విచారణ చేపట్టింది. మండలవ్యాప్తంగా 2,600 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు తేలింది. 2014కు ముందు రెవెన్యూ రికార్డులన్నింటినీ రెవెన్యూశాఖ జల్లెడ పడుతున్నది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు జీవో 59ని తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఒక్క హైదరాబాద్‌లోనే 18 19 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్‌ఎస్ నేతలకు కట్టబెట్టింది. ఆ భూములను మా ప్రభుత్వం ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చింది.
బీఆర్‌ఎస్ హయాంలో వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు అయింది. ఆ ఉద్యోగులను ప్రభుత్వం ఇతర శాఖల్లోకి బదిలీ చేసి అక్రమాలకు పాల్పడింది. రైతుబంధు పథకంలో దండిగా అక్రమాలు జరిగా యి. భూమి తక్కువగా ఉన్నవారు కూడా పట్టా పాస్‌పుస్తకాల్లో ఎక్కువ భూమి చూపించారు. ప్రజల సొమ్మును పథకం ద్వారా కాజేశారు.
ధరణి పోర్టల్‌తో రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరతరాల నుంచి భూములు సాగుచేసుకుంటున్న వారు భూములు కోల్పోయారు. పోర్టల్ సృష్టించిన తప్పులతో రైతులు అవసరానికి భూములు అమ్ముకోలేకపోయారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోయారు. మా ప్రభుత్వం ధరణి సమస్యలను సమీక్షించింది.
వాటి పరిష్కారానికి మార్గాలను చూపించేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఇచ్చిన సూచనల మేరకు మార్చిలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాం. 1.38 లక్షల దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్‌లో పరిష్కరించాం. అధికారాలను వికేంద్రీకరణ చేసి మండల స్థాయిలో తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలిచ్చాం.
దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైతే దరఖాస్తు దారుడికి సమాచారం ఇచ్చేలా నిబంధనలు అమలు చేస్తున్నాం. ఫేక్ ఎల్‌ఆర్‌ఎస్‌లను గుర్తించి చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మా ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం 2024 బిల్లును ప్రవేశపెట్టబోతుంది. తద్వారా రెవెన్యూ సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తాం. 2020 రెవెన్యూ చట్టంలో ప్రజలకు మేలు చేసే అంశాలను కొత్త చట్టంలో ఉండేట్టు చర్యలు తీసుకుంటున్నాం.
‘సిద్దిపేట’లో 400 ఎకరాలు అన్యాక్రాంతం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. 40 మంది బీఆర్‌ఎస్ నాయకులకు ఒక్కొక్కరికీ 10 ఎకరాల చొప్పున అందాయి. ఆ భూములపై కోర్టుల్లో వివాదం నడిచినా, చివరకు ప్రభుత్వమే గెలిచింది. ప్రస్తుతం ఆ భూములను సైతం ప్రొహిబిటెడ్‌లో పెట్టాం. భూములపై విచారణ పూర్తయ్యాక స్వాధీనం చేసుకుంటాం.
రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రైతులను బెదిరించి, భయబ్రాంతులకు గురి చేసి భూసేకరణ చేపట్టారు. ఆ భూముల్లో కొంత నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానిపైనా విచారణ జరుగుతున్నది. త్వరలో ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులను నియమిస్తాం. అవసరమైనంత సంఖ్యలో సర్వేయర్లనూ నియమిస్తాం. సర్వేయర్లకు ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తాం. త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేసే అవకాశం ఉంది.
ఏడాది పాలనపై పూర్తి సంతృప్తి..
దీపావళికి బాంబులు పేలుతాయని మేం ప్రకటించాం. బాంబులంటే ఎవరిఐనా అరెస్టు చేయడం, జైలుకు పంపించడం, కేసులు వేయడం కాదు. బీఆర్‌ఎస్ నాయకులు కళ్లులేని కబోదుల్లా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పుడు పనులపై విచారణ జరుగుతుంది. ఈ రేసింగ్, కాళేశ్వరం, రంగనాయకసాగర్ ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఫోన్ ట్యాపింగ్..
ఇలా అన్నికేసుల్లో అక్రమాలు బయటపడతాయి. మా ప్రభుత్వ ఏడాది పాలన నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. నా వరకు గృహ నిర్మాణశాఖ మంత్రిగా పేదలకు ఇందిర్మ ఇండ్లు నిర్మించాలనే సంకల్పం ఉంది. ఆ నిర్ణయం తీసుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది. రెవెన్యూశాఖలో సంస్కరణలు, ఆర్వోఆర్ చట్టం అమలు కూడా ఎంతో సంతృప్తినిచ్చాయి.
నేను నంబర్-2 కాదు..
సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత నేను నంబర్-2 అనే ప్రచారం నిజం కాదు. నిజానికి నంబర్ కూడా కాదు. నేను సీఎం మంత్రివర్గంలో ఒక కేబినెట్ మంత్రిని అంతే. నాకు సంఖ్య ఇస్తే నంబర్ 11లో ఉంటా. సీఎం మార్పు అనే ప్రశ్నే లేదు. మరో నాలుగేళ్లూ రేవంత్‌రెడ్డినే సీఎం. నేను రాజకీయాల్లోకి రాకముందు కాంట్రాక్టర్‌ను. ప్రస్తుతం నేను ఏ కంపెనీకీ డైరెక్టర్ కాదు.
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలకు నాకు సంబంధం లేదు. నాపై అలాంటి విమర్శలు చేయడంలో అర్థం లేదు. బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. ఈడీ సోదాల్లో నా ఇంట్లో ఏం దొరకలేదు కాబట్టి, నేనెవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను రాజకీయాల్లోకి వస్తే నా కుటుంబ సభ్యులు వ్యాపారాలు చేయొద్దా..? వారు రోడ్డునా పడాలా..?
ఇందిరమ్మ ఇండ్లలో ప్రజాప్రతినిధుల కోటా లేదు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కోటా ఉండదు. అత్యంత పేదలు, వితంతువులు, దివ్యాంగులు, పారిశుధ్య కార్మికులకు తొలి ప్రాధాన్యం. పథకం కోసం యాప్ విడుదల చేశాం. పూర్తి వివరాలు యాప్‌లో ఉంటాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తొలుత 3,500 చొప్పున ఇండ్లు నిర్మిస్తాం.
అలా ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నాలుగు విడతల్లో ఖాతాల్లో జమ చేస్తాం. లబ్ధిదారుడు తనకు నచ్చిన విధంగా 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అదనంగా నిర్మించుకున్నా అభ్యంతరాలు ఉండవు.