- చెరువులు, కుంటలను కబ్జా చేస్తే కేసులు
- తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ఎల్బీనగర్, ఆగస్టు 13: ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని, చెరువులు, కుంటలను కబ్జా చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. చెరువు, కుంటల భూములను కబ్జా చేశారని వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం వనస్థలిపురం పరిధిలోని సాహెబ్‌నగర్ కలాన్, మన్సూరాబాబాద్ డివిజన్‌లోని హత్తిగూడ చెరువును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాహెబ్‌నగర్ కలాన్‌లోని సర్వే నంబర్ 68లో ఆఫీసర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ కోసం 39, 40 నంబర్ల ప్లాట్లను కేటాయించారు.
కాగా, సీడబ్ల్యూసీ ఉద్యోగులు కిశోర్, చంద్రశేఖర్, నీల స్థానికంగా ఉన్న భూకబ్జాదారుల తో కుమ్మక్కై 39, 40 ప్లాట్లను ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కమ్యూనిటీ హాల్‌కు గిఫ్ట్‌డీడ్ చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించి, జీహెచ్‌ఎంసీలో నిర్మాణ అనుమతులు తెచ్చుకున్నారని , నిర్మాణాలపై నిలదీయగా చంపుతామని బెదిరించారని స్థానికులు చెప్పారు. దీనిపై స్థానికులు హయత్‌నగర్ కోర్టుకు వెళ్లి స్టేటస్ కో ఆర్డర్ తెచ్చారు. కోర్టు ఆదేశాలను సైతం కబ్జాదారులు లెక్క చేయకపోవడంతో ఆఫీసర్స్ కాలనీ సంఘం అధ్యక్షుడు బాలాజీ, స్థానిక నాయకులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం సాహెబ్‌కలాన్‌కు వచ్చి స్థలాన్ని పరిశీలించారు. అన్ని పత్రాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామ న్నారు. ప్రభుత్వ భూములను కబ్జా కానివ్వమని స్థానికులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని హత్తిగూడ చెరువును పరిశీలించారు. చెరువు కబ్జాపై స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కమిషనర్‌కు ఆధారాలు అందజేశారు. వరద కాల్వను పూడ్చివేశారని, ట్రెంచ్ లైన్ సైతం ధ్వంసం చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఎగువ ఉన్న కాలనీల నుంచి వచ్చే వరద వెళ్లే కాల్వ లేకపోవడంతో వానకాలంలో ఇళ్లు నీట మునుగుతాయని ఆయన దృష్టికి తెచ్చారు.
దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ వారికి తెలిపారు. తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారులపై సైతం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల ఇరిగేషన్ అధికారులు, ఆర్‌ఐలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు పరిశీలన
హైదరాబాద్ సిటీబ్యూరో: ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నల్లచెరువులో కబ్జాల గురించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తహసీల్దార్ వాణిరెడ్డి, డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, ఈఈ నాగేందర్, ఇరిగేషన్ ఏఈ పృథ్వీ పాల్గొన్నారు.