బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతి ఖని గనిపై సొంతింటి కల, అలవెన్సులపై ఐటీ మాఫీ, మారు పేర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం ముఖ్యమంత్రికి సంతకాల సేకరణలో భాగంగా కార్మికులు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు మాట్లాడుతూ.. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తమ మేనిఫెస్టోలో పెట్టిన సొంతింటి కల, ఐటి మాఫీ మారుపేర్ల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఒత్తిడి తీసుకురావడానికి పలు విధాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని మళ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ సమస్యలు పరిష్కరించేలా ప్రతిపక్షంగా కార్మికుల తరఫున పోరాడుతామని అన్నారు.
ఇప్పటివరకు సిఐటియు కల్పించిన అవగాహన మేరకు అన్ని యూనియన్లు ప్రజాప్రతినిధులు సొంతింటి కల, ఐటి మాఫీ అంటున్నారు తప్ప అదేలా సాధ్యమో చెప్పలేకపోతున్నారని విమర్శించారు. అందుకే కరపత్రాలు ద్వారా గనులపై ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ సమస్యల పరిష్కారాన్ని ఎంతమంది కార్మికులు కోరుకుంటున్నారో తెలియజేసేలా కార్మికులందరినీ భాగస్వామ్యం చేస్తూ సంతకాల సేకరణ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తామని అన్నారు. కొత్త గనులు రాకుండా, కార్మికులకు రావాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే భవిష్యత్తులో సింగరేణి అనేది పేరుకే పరిమితమవుతుందన్నారు. అందుకే గెలిచిన సంఘాలు గాని, ప్రజా ప్రతినిధులు గాని సంస్థకు వచ్చే బకాయిలపై దృష్టి పెట్టి ఇప్పించాలని కోరారు.
అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోకుండా కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చే విధంగా కృషి చేయాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా గెలిచిన సంఘానికి తమ బాధ్యతను గుర్తు చేస్తూ యాజమాన్యంపై సమస్యల పరిష్కారానికి నిస్వార్ధంగా పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియును బలోపేతం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ రమణయ్య, జడల ప్రవీణ్, నాగరాజు గని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.