21-03-2025 12:41:08 AM
అంబేద్కర్ విగ్రహానికి జిల్లా జేఏసీ వినతిపత్రం
జనగామ, మార్చి 20(విజయక్రాంతి): జనగామ జిల్లాకు ఎంతో ఘన చరిత్ర ఉందని, ఈ పేరు జనాల్లో పాతుకుపోయిందని, పేరు మారిస్తే ఊరుకోబోమని జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు హెచ్చరించారు. అవసరమైతే అభివృద్ధి పనులకు మహనీయుల పేర్లు పెట్టాలని ఆయన కోరారు. ఈ మేరకు జిల్లా పేరు మార్పు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని కోరుతూ గురువారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ అనే పేరుకు చారిత్రక నేపథ్యం ఉం దన్నారు. జనగామ గడ్డపై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, నల్లా నర్సింహులు, చుక్క సత్తయ్య, బమ్మెర పోతన, పాల్కూరు సోమనాథుడు తదితర మహనీయులు జన్మించారని, లైబ్రరీలు, ఆడిటోరి యం ఏర్పాటు చేసి వాటికి వీరి పేర్లు పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల సురేశ్, బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆసర్ల సుభాశ్, వందేమాతరం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు నల్లరావు, టీజీవిపి పట్టణ అధ్యక్షుడు వెంపటి అజయ్, మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అప్రోచ్ తదితరులు పాల్గొన్నారు