27-03-2025 01:47:59 AM
ప్రశ్నించే గొంతులు నొక్కుతున్న ప్రభుత్వం
నిర్బంధాలకు బీఆర్‌ఎస్ భయపడదు
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నల్లగొండ, మార్చి 26 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కారు రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయిస్తే సహించబోమని ఆ పార్టీ సీనియర్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. నల్లగొండలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఎమ్మెల్యే వీరేశం అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు.
స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో భారీ మొత్తంలో ఒప్పందం చేసుకొని ప్రశ్నపత్రాలన్నీంటిని లీక్ చేసేం దుకు కుట్రలు చేశారని పేర్కొన్నారు. నకిరేకల్లో దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు చేసే నైజం ఎమ్మె ల్యే అనుచరులకే ఉందన్నారు. ప్రశ్నపత్రం లీకేజ్ ఘటనపై ఓ పేపర్లో వచ్చిన వార్తను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కేసు నమోదు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని నిలదీశారు. కేటీఆర్ ఎక్కడ ఏం అంశంపై ప్రశ్నిస్తారో తెలియక ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే వీరేశానికి రాజకీయ భిక్షపెట్టిందే టీఆర్‌ఎస్ అని, ఉద్యమ నేత కేటీఆర్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు.
ఇటీవల సీఎంకు స్వీట్ పెట్టబోతే వీరేశాన్ని ఆయన నెట్టేసింది నిజమో? కాదో చెప్పాలని నిలదీశారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్ భయపడబోదని, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణాధ్యక్షుడు భోనగిరి దేవేందర్, పలువురు పట్టణ నాయకులున్నారు.