calender_icon.png 28 December, 2024 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కేసులతో వేధిస్తే సహించం

03-12-2024 01:09:29 AM

 కేసీఆర్ మొక్క కాదు.. వేగు చుక్క : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కార్యకర్తలపై ప్రభుత్వం కక్షగట్టి.. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమ పార్టీ తరఫున లీగల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలు ప్రచారం చేసినా, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినా సర్కారు సహించడం లేదన్నారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో సోమవారం తన నివాసంలో కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో నిధులు వరదగా పారితే ఇప్పుడు తిట్లు పారుతున్నాయన్నారు.

కేసీఆర్‌ను మొక్క అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని.. కేసీఆర్ మొక్క కాదు ఒక వేగుచుక్క అని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి గురువులకు సైతం చుక్కలు చూపి తెలంగాణను సాధించిన శక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసే వారే నిజమైన కార్యకర్తలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందు ఎండగట్టాలన్నారు.  అనంతరం అఖిల భారత పద్మశాలీ సంఘం నాయకులు కవితను కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు ్ల స్వామి, బొల్లా శివశంకర్, గుంటక రూప పాల్గొన్నారు.