26-01-2025 12:27:25 AM
సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హెచ్చరిక
కరీంనగర్, జనవరి 2౫ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అలా చేస్తే చూస్తూ ఊరుకోమని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హెచ్చరించారు. ఎలక్ట్రికల్ బన్సుల నిర్వహణ పేరుతో కరీంనగర్-2 డిపోను జేబీఎం సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వాటి నిర్వహణ బాధ్యతలను మెగా, జేబీఎంలకు ఇప్పటికే అప్పజెప్పిందని, వాటిని తక్షణమే వెనక్కి తీసుకుని ఆర్టీసీ సంస్థ పరిధిలోనే నిర్వహణ జరగాలని డిమాండ్ చేశారు.
పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు నడిచే రూట్లలో ఎలక్ట్రిక్ డిలక్స్ లగ్జరీ బస్సులు నడిపి మహిళలకు ఉచిత ప్రయాణం లేకుండా నీరుగార్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ నృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్యతోపాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.