14-02-2025 01:56:34 AM
బాంబ్ పేల్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, ఫిబ్రవరి 13: పరస్పర సుంకాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ‘మా మీద సుంకాలు విధించే ఏ దేశం మీదైనా తప్పకుండా సుంకాలు విధిస్తాం. మా మీద ఎంత పన్ను విధిస్తారో మేం కూడా అంత పన్ను తప్పకుండా విధిస్తాం. అన్ని దేశాల కంటే భారతే తమ మీద ఎక్కువగా పన్నులు వేస్తోంది’. అన్నారు.
ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం కూడా చేశారు. మోదీతో భేటీకి కొద్ది గంటల ముందే ట్రంప్ ఇలా సుంకాల గురించి ప్రకటించడం అంతే కాకుండా భారత్ తమ దేశం మీద అధిక పన్నులు వేస్తోందనడం మన దేశానికి పెద్ద దెబ్బగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు.
మోదీకి ఘనస్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్లిన ప్రధానికి వాషింగ్టన్‌లో ఘన స్వాగతం లభించింది. భారత సంతతి ప్రజలు వాషింగ్టన్‌లో మోదీకి సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ వారితో కాసేపు ముచ్చటించి ముందుకు సాగారు. ‘శీతల వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా తనకు సాదర స్వాగతం పలికిన ప్రవాసీయులకు కృతజ్ఞతలు’ అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌తో ప్రధాని భేటీ అయ్యారు.
బ్లెయిర్ హౌజ్‌లో బస..
ప్రపంచంలో అత్యంత ప్రత్యేక అతిథి గృహమైన బ్లెయిర్ హౌజ్‌లో ప్రధాని బస చేస్తున్నా రు. వాషింగ్టన్ డీసీలో ఉన్న వైట్ హౌజ్ ఎదురుగానే ఈ బిల్డింగ్ ఉంది. అగ్రరాజ్య పర్యటనకు వెళ్లిన కొద్ది మంది అతిథులకు మాత్రమే ఈ విడిది గృహం కేటాయిస్తారు. ఇందులో మొత్తం 119 గదులు ఉండగా.. 14 బెడ్రూమ్‌లు, 35 బాత్రూమ్‌లు, 3 డైనింగ్ హాల్స్, ఒక బ్యూటీ సెలూన్ కూడా ఉంది.
ఈ అంశాలపైనే చర్చ..
రెండు దేశాల అధినేతలు మరికొద్ది గంట ల్లో భేటీ కానున్నారు. ఈ ఇద్దరి మధ్య వాణి జ్యం, ఎనర్జీ, రక్షణ, భద్రత, సాంకేతిక భాగస్వా మ్యం, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ట్రంప్ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత మోదీతో భేటీ అవడం ఇదే మొదటి సారి. ఇప్పటికే 104 మంది భారతీయులను వెనక్కి పంపిన నేపథ్యంలో, వాణి జ్య సుంకాల భయం నెలకొన్న పరిస్థితుల్లో ఈ ఇద్దరు నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 2:30 గంటల సమయంలో వీరి భేటీ జరగనుంది.
జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్‌తో మోదీ పలు అంశాలపై చర్చించారు. మైఖేల్‌తో సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. మైఖేల్ వాల్ట్‌తో సాంకేతికత, భద్రత, రక్షణ, ఏఐ, సెమీ కండక్టర్, అంతరిక్ష రంగాలతో పాటు మరిన్ని అంశాల గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మస్క్‌తో భేటీ తర్వాత వివేక్ రామస్వామితో కూడా మోదీ భేటీ అయ్యారు.
పిల్లలతో మస్క్..
ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు మస్క్ తన సతీమణి, పిల్లలతో మోదీ బస చేస్తున్న బ్లెయిర్ హౌజ్‌కు విచ్చేశారు. మస్క్‌తో భేటీ అనంతరం ప్రధాని ఎక్స్‌లో వారి మధ్య చర్చకు వచ్చిన విషయాలను పోస్ట్ చేశారు. ‘అనేక అంశాల గురించి చర్చించాం. అంతరిక్షం, మొబిలిటీ, సాంకేతికత, ఆవిష్కరణలపై మస్క్‌కు చాలా ఆసక్తి ఉంది. భారత్ మినిమం గవర్నమెంట్.. మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ కోసం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు.