calender_icon.png 11 January, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీలకు అన్యాయం జరగనివ్వం

11-01-2025 12:00:00 AM

  1. అన్ని రంగాల్లో అండగా నిలుస్తాం
  2. ఉద్యమాల సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తాం
  3. విద్యార్థులకు వంద శాతం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు
  4. కుమ్రం భీం జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తాం 
  5. ఆదివాసీ సంఘాలు, నాయకులతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
  6. గోండీ భాషలో బోధనపై సమగ్ర నివేదికకు ఆదేశం

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఆదివాసీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. విద్యా, ఉద్యోగ, సంక్షేమం, అభివృద్ధి రాజకీయ రంగాల్లో ఆదివాసీలకు న్యాయం చేస్తామని సీఎం వివరించారు. శుక్రవారం సచివాలయంలో ఆదివాసీ సంఘాలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సీఎం రేవంత్‌రెడ్డి  సమావేశమయ్యారు.

తమ  ప్రాంతాల్లో రవాణా, సాగు, తాగునీటి సరఫరా, తమపై నమోదైన, నమోదవుతున్న కేసులు, విద్యా, ఉద్యోగ, ఆర్థిక సమస్యలను ఆదివాసీ నాయకులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపగా, మరికొన్నింటిని సమగ్ర అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇది తొలి సమావేశం మాత్రమేనని, ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి సమావేశమవుదామని ఆదివాసీ నాయకులకు సీఎం సూచించారు. ఏడాదికి మూడు సార్లు జరిగే సమావేశాల్లో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, రాబోయే కాలంలో పరిష్కరించుకోవాల్సిన అంశాలపై చర్చిస్తామన్నారు.

ఆదివాసీల  సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనలకు దిగవద్దని సీఎం సూచించారు. ఆందోళనల ఫలితంగా యువకులపై కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఆదివాసీలపై ఉద్యమాల సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని, ఈవిషయంలో అవసరమైతే శాసనసభలో చర్చపెట్టి తీర్మానం చేస్తామన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా తాను ఎంపికైన తర్వాత తొలి సమావేశం ఇంద్రవెల్లిలోనే పెట్టానని, ఆ సమావేశంలో తన దృష్టికి వచ్చిన ఇంద్రవెల్లి అమరుల స్మృతివనం ఏర్పా టు, అమరుల కుటుంబాలకు ఇండ్ల మంజూరు వంటి వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేశామని సీఎం తెలిపారు. 

రాజకీయాలపరంగా ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూస్తున్నామని, సీతక్కను ఆదిలాబాద్ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా పెట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆదివాసీ యోధుడు కుమ్రం భీం జయంతి,  వర్ధంతి అధికారికంగా  నిర్వహిస్తామని  ప్రకటించారు. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం  ఆదేశించారు.

ఆర్థికాభివృద్ధిపై దృష్టి

ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇండ్లతో సంబంధం లేకుండా ఆదివాసులకు సీఎం కోటా కింద ప్రత్యేకంగా మంజూరు చేస్తామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ఈ ఇళ్లు ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

నాన్ ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. ఆదివాసీ రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు (వంద శాతం రాయితీ) అందిస్తామని, ఇందిర జలప్రభ కింద ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సీఎం  సూచించారు.

ఉచితంగా సోలార్ పంపుసెట్లతో పాటు ఇళ్లకు సోలార్ ద్వారా విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.  ఆదివాసీ గూడేల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఐటీడీఏల పరిధిలో వెంటనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు.

కేస్లాపూర్ జాతరకు నిధులు

కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  ఆదివాసీలకు ఎంతో కీలకమైన రాయి సెంటర్లకు భవనాల నిర్మాణం చేపడ్తామని సీఎం తెలిపారు. రాయి సెంటర్ల నిర్మాణం, అందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలు, ఎన్ని భవనాలు అవసరమనే దానిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. 

సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక స్టడీ సర్కిల్

ఆదివాసీ విద్యార్థుల విద్యా, ఉద్యోగ, ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్తామని,  స్టడీ సర్కిల్‌కు అవసరమైన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

“దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ విద్యార్థు లందరికీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తాం. ఆ దరఖాస్తుల వివరాలను వెంటనే మంత్రి సీతక్కకు అందజేయాలి. విద్యార్థులకు గోండీ భాషలో ప్రాథమిక విద్య బోధించడానికి అవసరమైన ప్రణాళికపై అధ్య యనం చేసి నివేదిక సమర్పించాలి. 

ఉట్నూ రు, భద్రాచలంలోని ట్రైబల్ బీఈడీ కళాశాలల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలి..”అని సూచించారు.  ఆదివాసీ విద్యా ర్థులకు స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక ప్రాధాన్యంతో పాటు  వారికి వసతి కల్పిస్తామ న్నారు.  ఏజెన్సీలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్చుతున్నామన్నారు.