23-03-2025 12:00:00 AM
తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా న్యాయవాదుల పాత్ర కీలకమైంది. రాష్ట్ర జేఏసీ ఏ పిలుపు ఇచ్చినా అది అందుకుని రంగంలోకి దూకి.. ఉద్యమించారు. ఉద్యమం అజరామరం. నాడు కేసీఆర్‌ను అరెస్ట్ చేసి.. ఖమ్మం సబ్ జైలుకు తరలిస్తే.. జిల్లా న్యాయవాదులు, పొలిటికల్ జేఏసీ కదిలివచ్చిన తీరు ఎప్పటికీ మర్చిపోలేం.
సహజ సిద్ధంగా ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లా కోర్టులో ఆనాడు ఆంధ్రా వలసవాదులు ఎక్కువగా ఉండడంతో న్యాయవాద జేఏసీకి ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. అయినా సరే జేఏసీ నేతృత్వంలో న్యాయవాదులంతా ఐక్యమై ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. సభలు, జిల్లా కోర్టులో విధుల బహిష్కరణ, రైలురోకోలు, కోర్టు బంద్‌కు పిలుపునివ్వడం, సకల జనుల సమ్మెతో పాటు సాంస్కృతిక ఉద్యమాలు ప్రజల్ని ఎంతగానో కదిలించాయి నాడు. జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, జానపద కళాకారుడు రసమయి బాలకృష్ణ తదితర ఉద్యమనాయకులు నాడు జిల్లా కోర్టును సందర్శించి, న్యాయవాదుల ఉద్యమానికి అండగా నిలబడ్డారు. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్న న్యాయవాద నేతలపై పోలీసులు కేసులు సైతం పెట్టారు.
అప్పటి న్యాయవాద జేఏసీ చైర్మన్‌గా బిచ్చాల తిరుమలరావు, కో కన్వీనర్‌గా కొండపల్లి జగన్మోహన్‌రావు, సీనియర్ న్యాయవాదులు రానేరు కిరణ్‌కుమార్, కర్లపూడి శ్రీను, మధుబాబు, హైమావతి తదితరులు ఉద్యమానికి నాయకత్వం వహించి.. ముందుండి నడిపించారు.
చైతన్యం రగిల్చిన గీతం..
జిల్లా కోర్టులో అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం’ ఈ గీతాన్ని ప్రతి రోజు ఉదయం 10ః10 నిమిషాలకు న్యాయవాదులు ఆలపించేవారు. గీతాన్ని ఆలపించిన తర్వాతనే అంతా విధుల్లోకి వెళ్ళేవారు. 2009 డిసెంబర్ 7న ప్రారంభించిన గీతాలపనను 2014 జూన్ 2 వరకు కొనసాగించడం విశేషం. రాష్ట్రఉద్యమ చర్రితలోనే ఇది ప్రథమం. ఇలా ఎక్కడా తెలంగాణ గీతాన్ని ఏకధాటిగా 1550 రోజులు ఆలపించిన చరిత్ర ఖమ్మం న్యాయవాదులకే దక్కుతుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న.. ఉద్యమంలో పుట్టిన ఈ గీతం న్యాయవాదుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి, ముందుకు నడిపించింది. న్యాయవాద జేఏసీ, రాష్ట్ర స్థాయి ఉద్యమ నేతలెందరో ఖమ్మం కోర్టును సందర్శించి తెలంగాణ గీతాలపన వినేవారు.
ధైర్యంతో ముందడుగువేశాం!
ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఆంధ్రా వలసదారులు సహకరించకపోయినా.. ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాం. నాడు కొన్ని శక్తులు మమ్మల్ని అరెస్ట్‌లు చేయించి, తప్పుడు కేసులు పెట్టాయి. బైండోవర్ కేసులు పెట్టి వేధించాయి. అయినా తెలంగాణ సాధనే లక్ష్యంగా న్యాయవాదులను ఒక్కటి చేశాం. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపునందుకుని ధైర్యంతో ముందడుగు వేశాం. పోలీసులు నాపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వేధించారు. అయినా భయపడకుండా ఉద్యమాన్ని ఉధృతం చేశాం. నాటి ఉద్యమ స్ఫూర్తిని తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుతుంది.
బిచ్చాల తిరుమలరావు, న్యాయవాద జేఏసీ ఛైర్మన్
ఆ గీతం చైతన్యం నింపింది..
నాడు ఖమ్మం కోర్టులో ఏకధాటిగా 1,550 రోజులు పాటు న్యాయవాదులంద రూ కలిసి ఆలపించిన జయ జయహే తెలంగాణ గీతం న్యాయవాదుల్లో చైతన్యాన్ని నిం పింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నో కష్టాలు పడి, కేసులు ఎదుర్కొని, ఉద్యమాన్ని నడిపించాం. 2009 డిసెంబర్ 7న ఖమ్మం జిల్లా కోర్టులో ప్రారంభించిన తెలంగాణ గీతం ఆలాపన ఏకధాటిగా 1,550 రోజుల పాటు కొనసాగింది. దానికి తానే నాయకత్వం వహించా. ఉదయం కోర్టుకు రాగానే న్యా యవాదులంతా కలిసి ముందు తెలంగాణ గీతాన్ని ఆలపించిన తర్వాతనే కోర్టుల్లో ఆడుగుపెట్టేవాళ్లం. రైలు రోకో సందర్భంగా కేసు నమో దు చేశారు. మా కృషిని గుర్తించిన కేసీఆర్ నాతో పాటు కొందరికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల్లో అవకాశం కల్పించి.. సముచిత గౌరవం కల్పించారు. తెలంగాణ ఉద్యమం గురించి ఎంత చెప్పినా తక్కువే.
కొండపల్లి జగన్మోహన్‌రావు, జేఏసీ కో కన్వీనర్ వై శ్రీనివాస్, ఖమ్మం