అవసరమైతే 2 లక్షలకంటే ఎక్కువ రుణమాఫీ
రైతులకు సోలార్ పంపుసెట్లు ఇస్తాం
- పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేస్తాం
- నాడు కేసీఆర్ లక్ష మాఫీకి ఐదేళ్లు టైం తీసుకున్నడు
- మాకంత సమయం అవసరం లేదు
- 2030 నాటికి గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా కృషి
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- ఎల్లంపల్లి భూ నిర్వాసితులకు రూ. 18 కోట్ల పరిహారం అందజేత
- పెద్దపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన
- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాడు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నరు.. నోటికచ్చిందల్ల మాట్లాడిన్రు.. కానీ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు.. ఆ నమ్మకం వమ్ము చేయకుండా ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం.. నాడు కేసీఆర్ రూ. లక్ష మాఫీ చేసేందుకే ఐదేళ్లు సాగదీసిండు.. కానీ మేము అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లోనే రూ. 2 లక్షల రుణం మాఫీ చేస్తున్నం.. 15 రోజుల్లోనే 18 వేల కోట్ల రుణ మాఫీ చేసినం.. అవసరమైతే రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా మాఫీ చేస్తాం.. రైతును రాజుగా చేసి తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. ఆ దిశగానే త్వరలో రైతులకు సోలార్ పంపుసెట్లు అందజేస్తున్నాం.. పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేసి ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుంది.. రామగుండంలో రూ.వెయ్యి కోట్లతో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేస్తాం.. అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేస్తూ 2030 నాటికి గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్ స్టోరేజ్ ఎనర్జీ తదితర రంగాలలో 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి రైతుల మోటార్లకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌తో ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పెద్దపల్లి జిల్లాలో శనివారం డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. నంది మేడారంలో 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత కటికనపల్లి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ ఏఎంసీ నూతన పాలక వర్గాలచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఏఎంసీ యార్డులో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.18 కోట్ల చెక్కును 126 మందికి అందజేశారు. పెద్దపల్లి మండలం రంగాపూర్‌లో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు.
పెద్దపల్లిలో టీయూఎఫ్‌ఐడీసీ రూ.60 కోట్ల నిధులతో పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన వాటర్ ట్యాంకు నిర్మాణం, రూ23 కోట్లతో టాస్క్ సెంటర్, రూ30 కోట్లతో పెద్దపల్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ధర్మారం, పెద్దపల్లిలో వేర్వేరుగా జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అభ్యర్థన మేరకు మేడారంలో పూర్తిస్థాయిలో రైతులకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు త్వరలోనే భూమిపూజ చేస్తామన్నారు. రూ.2లక్షల రుణమాఫీ కింద అతి తక్కువ సమయంలో 18వేల కోట్ల రైతుల ఖాతాలో జమ చేసామన్నారు.
పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామనీ, సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు సైతం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఎల్లంపల్లి లిఫ్ట్ సంబంధించి సబ్ స్టేషన్ నిర్మిస్తే వేల ఎకరాల సాగునీరు పారుతుందని అందిన ప్రతిపాదనల మేరకు సబ్ స్టేషన్‌ను వెంటనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో సమీకృత గురుకుల భవనాన్ని త్వరలో మంజూరు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలే కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టాలు అవుతాయని డిప్యూటీ సీఎం చెప్పారు.
అధికారం పోయి ఆగమైతర్రు: మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న ప్రజాపాలన అందిస్తున్నామని, ఆరు గ్యారం టీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చాలా దగ్గరలోకి వచ్చామని, కానీ ప్రతిపక్ష పార్టీకి అధికారం పోవడంతో ఆగమాగమై ఏం చేస్తున్నరో వారికే అర్థం కావడం లేదనీ, వాళ్లు వాళ్లు కొట్టుకొని కాం గ్రెస్ పార్టీని బదనాం చేస్తుంటే వాళ్ల పిచ్చి ఏ స్థాయికి ముదిరిందో అర్థం అవుతున్నదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పదేళ్లపాటు పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల వెంబడి తిరిగి 18 కోట్లు సాధించడంలో విప్ కృషి అభినందనీయమన్నారు.
టేలాండ్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు ద్వారా మంథని, పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో సాగునీరు స్థిరీకరణ అవుతుందనే ఉద్దేశంతో సాగునీటి మంత్రికి ప్రతిపాదనలు పంపించి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో నిధులు కేటాయించామని, సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపారు. గడిచిన 9 నెలల కాలంలో ఒక్కటి తర్వాత ఒక్కటి పథకాలను అమలుచేసుకుంటూ వస్తున్నామని, దారి వెంట వెళ్తుంటే ఎన్నో మొరుగుతాయని అవన్నీ పట్టించుకొని ఆగితే గమ్యం చేరుకోలేమన్నారు.
ముందుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షలు మాఫీ చేస్తున్నామని, సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాకపోతే వాటిని పరిష్కరించి అర్హులైన వారికి అమలు చేస్తామన్నారు. ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యలకు సంబంధించి 18 ఏండ్లు నిండిన వారికి పరిహారం అందించే అంశంలో ఆర్డీవో, కలెక్టర్‌చే నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామన్నారు.
రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మించి తీరుతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, ప్రజా ప్రతినిధులు, డిసిపి రచన, ఏసీపీలు గజ్జి కృష్ణ యాదవ్, మడల రమేష్, నాయకులు పాల్గొన్నారు.