calender_icon.png 24 October, 2024 | 5:46 PM

ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతాం

09-07-2024 03:58:59 AM

  • సినీ నటి, టీచ్ ఫర్ చేంజ్ ఫౌండర్ మంచు లక్ష్మి 
  • భువనగిరిలో స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి, జూలై 8 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యనందించడమే లక్ష్యంగా టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ కృషి చేస్తోందని సినీ నటి, ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మంచు లక్ష్మిఅన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బగాయత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్‌ను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంత్ కే జండగేతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లావ్యాప్తం గా 33 స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ప్రారంభించినట్టుగా తెలిపారు.

ప్రతి క్లాస్ రూమ్‌లో స్మార్ట్ టీవీ, పెయింటింగ్ వర్క్స్, లో లైన్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అనంతరం క్రౌడ్ 4 సీ స్వచ్ఛంద సంస్థ సీఈవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని మరో వంద ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ సదుపాయం కల్పించనున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గంగాధర్, డీఈవో నారాయణరెడ్డి, ఎంఈవో నాగవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మాయ దశరథ తదితరులు పాల్గొన్నారు.

విద్యా పీఠం భవన నిర్మాణానికి హామీ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న సంస్కృత విద్యాపీఠం భవన నిర్మాణం తమ సంస్థ ద్వారా చేపడతామని మంచు లక్ష్మిహామీ ఇచ్చారు. ఆమె స్వామివారిని దర్శించుకున్న అనంతరం సంస్కృత విద్యా పీఠాన్ని ఆలయ ఈవో భాస్కర్ రావుతో కలిసి సందర్శించారు. అక్కడి విద్యార్థులు తమకు శాశ్వత భవనం నిర్మించాలని కోరగా, నిర్మాణానికి హామీ ఇచ్చారు.