calender_icon.png 9 February, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ ఢిల్లీగా మార్చుతాం

09-02-2025 01:45:17 AM

* విజయోత్సవ సంబురాల్లో పాల్గొన్న మోదీ

* ఇది సామాన్య విజయం కాదన్న ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబురాల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ.. ‘ఢిల్లీ విజయం సామాన్య విజయం కాదు. ఢిల్లీని తప్పకుండా వికసిత్ ఢిల్లీగా మారుస్తాం.

ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం. బీజేపీపై నమ్మకం ఉంచిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. మీరు మాపై చూపించిన ప్రేమను అభివృద్ధి రూపంలో మీకు తిరిగి అందజేస్తాం. పదేండ్ల నుంచి ఢిల్లీ వాసులు అనుభవిస్తున్న కష్టాలు తొలిగిపోనున్నాయి. ఈ పదేండ్లు కూడా అహంకారంతో పాలించారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు పాటు పడ్డ కార్యకర్తలకు అభినందనలు.

డబుల్ ఇంజిన్ సర్కారు మీద ఇక్కడి ప్రజలు విశ్వాసం ఉంచారు. ఇకపై దేశ రాజధానిలో వికాస్, విజన్, విశ్వాస్ అనే నినాదాలు వినిపిస్తాయి. ఢిల్లీ మినీ భారత్. ఇక్కడ గెలిచామంటే దేశం మొత్తం కూడా బీజేపీకి అనుకూలంగా ఉందని అర్థం. రాజధాని అభివృద్ధికి నాది గ్యారెంటీ. ఇక్కడ మెట్రో పనులు ముందుకెళ్లకుండా ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న వారు అడ్డుపడ్డారు.

అందుకోసమే ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పారు. ఢిల్లీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తాం. ఇక్కడి నేతలు ఇన్ని రోజులు దోచుకున్న సంపదను కక్కిస్తా. అవినీతి, కుంభకోణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఎన్నో ఎత్తులు వేసింది. ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా ఢిల్లీని పాలిస్తాం’. అని మోదీ పేర్కొన్నారు. 

ఢిల్లీ ప్రజలు మమ్మల్ని నమ్మారు

జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీపై విమర్శలు గుప్పించారు. ‘ఢిల్లీ వాసులు మమ్మల్ని నమ్మారు. ఈ విజయం దక్కేందుకు కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమిం చారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీ ప్రజలు మా వెంటే నడిచారు. పేదలు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఢిల్లీ ప్రజల సమస్యలను ఇన్ని రోజులు ఆప్ గాలికొదిలేసింది’ అని ఆరోపించారు.  

కార్యకర్త కోసం ప్రసంగం ఆపిన ప్రధాని

ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో విజయోత్సవ సభలో పాల్గొన్న ఓ కార్యకర్త అసౌకర్యానికి గురయ్యారు. అది చూసిన మోదీ.. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి.. ఆ కార్యకర్తకు మంచి నీళ్లు ఇవ్వాలని అక్కడున్న వారికి రిక్వెస్ట్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి ఆ కార్యకర్త మామూలు స్థితికి రావడంతో మళ్లీ ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. ఆయన ప్రసంగంలో అన్నా హజారే గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ ఫలితాలతో అన్నా హజారేకు ఉపశమనం లభించి ఉంటుందని వ్యాఖ్యానించారు.