ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్ర
ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): ఈ ప్రభుత్వం అందరిదనీ, సర్వమతాలకు స్వేచ్ఛ అవకాశాలను ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం ఇందిరాపార్కు ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఇస్కాన్ టెంపుల్ అబిడ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీజగన్నాథ రథయాత్రను సీఎం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సందేశం అందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇస్కాన్ సంస్థ ప్రార్థనలతో రాష్ట్రం సుఖశాంతులతో వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగన్నాథ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుంచి అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నారాయణగూడ, బర్కత్‌పుర, కాచిగూడ, అబిడ్స్ మీదుగా ఇస్కాన్ టెంపుల్‌కు తరలివెళ్లింది. భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని హారతులు పట్టారు.