ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు
చేవెళ్ల, జనవరి 25: చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితే తీవ్రంగా నష్టపోతామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మాజీ ఎంపీపీ కర్నె శివప్రసాద్ నేతృత్వంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్లకు సమీపంలో ఉన్న మల్లారెడ్డి గుడ, కందవాడ, పల్గుట్ట, పామెన గ్రామాలను వదిలేసి దూరంగా ఉన్న ఊరెళ్లను మున్సిపాలిటీలో కలపడం సరికాదని మండిపడ్డారు.
తమ గ్రామంలో ఇప్పటికీ 300 మంది ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నారని, మున్సిపాలిటీలో చేరితే వారికి తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. అదేవిధంగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు విపరీతంగా పెరిగిపోయి తమపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఆమరణ నిరాహారదీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఎండీ జహంగీర్, ఊరడి నర్సింలు, మాజీ ఉప సర్పంచ్ విట్టలయ్య, వార్డు మెంబెర్ చాను, గ్రామస్తులు పాల్గొన్నారు.