calender_icon.png 28 November, 2024 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిమితి ఎత్తేస్తాం

06-11-2024 02:08:15 AM

రిజర్వేషన్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

  1. తెలంగాణ కులగణన దేశానికే రోల్‌మాడల్
  2. సంపద సమానంగా పంచాలంటే గణన కీలకం 
  3. మేం చేస్తున్నది రానున్న తరాలకు అడ్మినిస్ట్రేషన్
  4. దేశంలో నేటికీ అంటరానితనం, కుల వివక్ష  
  5. కార్పొరేట్, న్యాయ వ్యవస్థ, మీడియాలో దళితులు, బీసీలు, ఆదివాసీలు ఎందరు? : రాహుల్
  6. గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో మేధావులతో ముఖాముఖి

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): దేశంలో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టేది కేవలం కులగణన కాదని, రానున్న తరాలకు అడ్మినిస్ట్రేషన్ లాంటిదని చెప్పారు.

దేశ సంపద ప్రజలకు సమానంగా పంచాలంటే.. కుల గణన సర్వేనే కీలమని అన్నారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శమని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. దేశంలో ప్రతి చోట కుల వివక్షత స్పష్టంగా కనిపిస్తోందని, కులగణన ద్వారా అసమానతలను తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్నారు.

పీసీసీ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కులగణనపై మేధావులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలతో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో రాహుల్‌గాంధీ పాల్గొని, ప్రసంగించారు. ‘దేశంలో కుల వివక్ష ఇంకా ఉంది.. ఆది బయటికి కనిపించదు. సము ద్రం లోపల ఉన్న మంచుగడ్డ లాంటిది.

ఈ కుల వివక్ష చాలామంది జీవితాలను నాశనం చేయడంతోపాటు ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీస్తోంది. నాకున్న చాలా మంది అగ్రవర్ణాల మిత్రులు కూడా కుల వివక్షలేదని, మేమెప్పుడు చూడలేదని అంటుంటారు. ఎందుకంటే వాళ్లు అగ్రకులాల వారు కావడంతో కులవివక్షత కనిపించదని, అది సము ద్రంలోని మంచుగడ్డలాంటిదని వాళ్లకు చెప్పేవాడిని.

ఈ కుల వివక్షతతో రాజ్యాంగానికి కూడా ముప్పు ఉంది. అయితే కుల వివక్షతకు అనుకూలంగా ఉన్నవాళ్లే.. కుల గణనను వ్యతిరేకిస్తున్నారు’ అని  రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. 

దేశంలో ఎవరెంతో తెలియాల్సిందే..

దేశంలో ఎంత మంది కార్పొరేట్ సెక్టార్లలో దళిత వ్యాపారులు ఉన్నారో.. న్యాయ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలున్నారో? మీడియాలో ఆదివాసీలు ఎందరున్నారనే నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని రాహుల్‌గాంధీ అన్నారు. ‘1912లో అతిపెద్ద నౌక టైటానిక్ యూకే నుంచి అమెరికాకు బయలుదేరింది.

టైటానిక్‌ను తయారు చేసిన వాళ్లు అది సముద్రంలో మునగదని చెప్పారు. కొన్ని వారాల్లో సముద్రంలోని మంచుగడ్డలను ఢీకొట్టి టైటానిక్ మునిగింది. మన దేశంలో కూడా అంటరానితనం సముద్రంలోపల ఉన్న మంచుగడ్డ లాంటిది. ప్రజలకు కనిపించకుండా ఉందని ఒప్పుకోవాలి. కుల వివక్షత అగ్రవర్ణాల్లోనే కాదు.. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థలోనూ ఉన్నది. దీన్ని కులగణన ద్వారా మాత్రమే సరిచేయవచ్చు’ అని అన్నారు.  

బ్యూరోక్రసీ కులగణన వద్దు 

కుల గణనతో ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఉన్నారో తెలిసిపోతుందని, తద్వారా దేశ సంపదను జనాభా నిష్పత్తి మేరకు ఏ విధంగా విధంగా పంచా లి, అసమానతలను ఎలా సరి చేయాలో ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుందని రాహుల్‌గాంధీ అన్నారు. 

కులగణన ద్వారా ఎవరి జనాభా ఎంతో తేలిపోతుందని, కార్పొరేట్ కంపెనీల్లో , న్యాయ వ్యవస్థ, సైనికుల్లో ఎవరు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చని చెప్పారు. కులగణనపై బ్యూరో క్రసీ పాలసీ వద్దని, ప్రశ్నలు ఏ విధంగా ఉండాలనేది సామాన్య ప్రజలు, దళితులు, ఓబీసీలే నిర్ణయం తీసుకోవాలని, తద్వారా కులగణనపై ఏ విధంగా ముందుకు వెళ్లడానికి మార్గం దొరుకుతుందన్నారు.

కుల గణనలో ఏమైనా పొరపాట్లు జరగొచ్చని, వాటిని సరిచేసుకుని ముందుకెళతామని స్పష్టంచేశారు. ఈ విషయంపై ప్రపంచస్థా యి ఓ ఆర్థిక నిపుణుడితో చర్చిస్తే ఇండియాలోనే అసమానతలు, కుల వివక్ష ఎక్కువగా ఉన్నాయని వివరించారని తెలిపారు.

దేశం ఆర్థికంగా, శక్తివంతంగా ఉండాలంటే విక్షత రూపుమాపాలని, అందుకు రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాను ప్రజల మధ్యకు వెళ్లి వివక్ష లేదని అబద్ధం చెప్పలేనని, అందుకే వాస్తవాలు చెప్తుంటే బీజేపీ నాయకులు ఓర్చుకోవడం లేదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు.