03-04-2025 01:04:22 AM
రామాయంపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
రామాయంపేట, ఏప్రిల్ 2ఃఅభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మెదక్ నియోజకవర్గం అగ్రగామిగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. బుధవారం రామాయంపేట మండలంలో ఆయన పర్యటించారు. దామరచెరువు గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని పలువార్డుల్లో సుమారు రూ.14.50కోట్లతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
అనంతరం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ రామాయంపేట పట్టణ, మండల అభివృద్ధికి 30 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా 14 కోట్ల 50 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దారిద్య రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రజినీకుమారి, డిఎం సివిల్ సప్లై సురేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.