- పరిశీలనలో ఫీజుల నిర్ధారణ, నియంత్రణ కమిటీ
- అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల విలీనంపై అధ్యయనం
- విద్యార్థుల్లేని స్కూళ్ల ఉపాధ్యాయులు బదిలీ
- విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం 34వ స్థానం
- సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ తొలి భేటీ
- పాల్గొన్న మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లపై అమలు చేసి వాటిని కంట్రోల్‌లో పెడతా మని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. కోచింగ్ సెంటర్లపై ఎటువంటి నియం త్రణ లేకపోవడంతో అభ్యర్థుల భద్రత, ఫీజుల భారంపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేపోయామని తెలిపారు. విద్యారంగ సంస్కరణల పై బుధవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం జరిగిం ది.
పలు అంశాలపై ఉన్నతాధికారులకు మార్గదర్శనం చేశారు. సమావేశంలో కమిటీ సభ్యు రాలు మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలకు కోచిం గ్ నిర్వహిస్తున్న కొన్ని సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా జూనియర్ కాలేజీలను నడుపుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. కోచింగ్ సెంటర్ల నియంత్రణపై కేంద్రం గైడ్ లైన్స్‌ను అమలు చేసి వీటిని కట్టడి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్మీడియట్ కాలేజీల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమి టీ ఏర్పాటే చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు శ్రీధర్‌బాబు వెల్లడించారు.
ఉపాధ్యాయులను బదిలీ చేయాలి..
ప్రభుత్వ స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా తీర్చిదిద్దగలిగితే పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొ న్నారు. అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను వేర్వేరుగా నడపడం వల్ల మానవ వనరుల వృథా జరుగుతోందని రెండింటినీ విలీనం చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక టేశంను ఆదేశించారు. విద్యార్థులు లేని 1,600 పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయాలని సూచించా రు.
డిగ్రీ కళాశాలల్లో బీఏ కోర్సుల పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసి విద్యార్థులను ఉద్యోగాలకు సంసిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసే పనులను వేగవంతం చేయాలని చెప్పారు. మాసబ్‌ట్యాంక్, రామంతాపూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, కొత్తగూడెం, సికింద్రాబాడ్, కులీకుతుబ్‌షా పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇంజినీరింగ్ కాలేజీలను ప్రారంభిస్తామని తెలిపారు.
సమాజం కోసం ఆలోచించేలా: సీతక్క
విద్యా సంస్థల్లో కేవలం పాఠ్యాంశాలే కాకుండా విద్యార్థులను సమాజం కోసం ఆలోచించేలా ప్రోత్సహించడం, మహిళలకు గౌరవం ఇచ్చేలా తీర్చిదిద్దాలని మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. మహిళలపై లైంగికదాడులు, వేధింపుల ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోం దన్నారు. విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలుంటాయో5,6 తరగతుల టెక్ట్స్ బుక్‌ల్లో ఈ అంశాలను పాఠాలుగా చేర్చాలని ఆదేశించారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని డీఈ వోలు, ఎంఈవోలతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ స్కూళ్ల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలని సూచించారు.
రాష్ట్రంలోని 26 వేల పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని వెల్లడించారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు ఎందుకు వెళ్తున్నారో ఆత్మ విమర్శ చేసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫీజులపై నియంత్ర ణ లేకపోతే ఎలాగని ప్రశ్నించారు.
ప్రతిపక్ష పార్టీలు లేని సమస్యలను సృష్టిస్తూ విద్యా వ్యవస్థ విఫలమైందని చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటే శం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్, సెక్రటరీ శ్రుతి ఓఝా, విద్యా శాఖ స్పెషల్ సెక్రటరీ హరిత, ఇంటర్ బోర్డు జాయింట్ సెక్రటరీ కే వసుంధరా దేవి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం 34వ స్థానం..
విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం 34వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. రెండేళ్లలో ఈ దుస్థితి నుంచి బయటపడాలని విద్యా శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. అన్ని పాఠశాలలు, కాలేజీల్లో డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లు కూడా ఈ దిశలో ముందడుగు వేసేలా చూడాలని తెలిపారు. డిగ్రీ కాలేజీల్లోని పబ్లిక్ పాలసీ విద్యార్థులను ఏడాది పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల వద్ద ఇంటర్నీలుగా పనిచేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
దీని వల్ల వారికి ప్రభుత్వ పాలనపై అవగాహన కలుగుతుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో కృత్రిమ మేథను వినియోగించాలని కోరారు. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు చదివే విద్యార్థులకు పరి శ్రమల్లో ఆన్ హ్యాండ్ శిక్షణనిస్తే వారికి వెంటనే ఉద్యోగాలు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సృజనను బయటకు తెచ్చేలా ప్రతి కళాశాల డిజిటల్ మ్యాగజైన్‌లను నడపాలని సూచించారు. బీకాం, బీబీఏ, ఎంబీఏ విద్యార్థులకు బీఎఫ్‌ఐసీ సంస్థల్లో శిక్షణ ఇప్పించాలని తమ ప్రభు త్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీల్లో బయో సైన్సెస్, ఫార్మా కోర్సులను వచ్చే ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా పాఠ్యాంశాలు రూపొందించాలని ఆదేశించారు.