- గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సు విజయవంతం
- కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): దేశీయంగానే బొగ్గు ఉత్పత్తిని పెంచి, విదేశాలపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకుంటామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒడిశాలోని కోణార్క్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన 3వ జాతీయ బొగ్గు గనుల శాఖ మంత్రుల సదస్సు మంగళవారం ముగింపు సమావేశం సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.
ఈ సదస్సు అత్యంత విజయవంతంగా ముగిసినట్టు ప్రకటించారు. బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రంగంలో సంస్కరణలు తీసుకురావడంతోపాటు సంబంధిత వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అందరి భాగస్వామ్యంతో దేశీయంగానే బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు, గనుల రంగంలో స్వయం సమృద్ధి దిశగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
సహకార సమాఖ్య విధానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో బొగ్గు గనుల రంగంలో ఆయా రాష్ట్రాల అవసరాలను తెలుసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందులో భాగంగానే ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
బొగ్గు గనుల రంగాన్ని స్వయంసమృద్ధిగా మార్చడంతోపాటు రాష్ట్రాల మైనింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ స్టాల్‌ను కిషన్‌రెడ్డి సందర్శించారు. భువనేశ్వర్‌లోని మహానంది కోల్ట్ ఫీల్డ్స్ పనితీరును సమీక్షించారు.