calender_icon.png 18 October, 2024 | 9:02 PM

జాతీయ విద్యావిధానాన్ని అమలు చేస్తాం

18-10-2024 01:35:03 AM

  1. ప్రపంచంతో పోటీ పడేలా సిలబస్‌లో మార్పులు అవసరం
  2. విశ్వవిద్యాలయాలకు సరిపడా బడ్జెట్, సిబ్బంది కేటాయింపుల్లేవు
  3. బాధ్యతలు స్వీకరించిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో జాతీయ విద్యావి ధానాన్ని అమలు చేస్తామని, అది తమకు ముఖ్యమైన ఛాలెంజ్ అని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిప్టారెడ్డి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం మాసాబ్ ట్యాంక్‌లోని కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ఐ పురుషోత్తం నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీ పడాలంటే జాతీయ నూతన విద్యావిధానాన్ని అమలు చేయాల్సిందేనని, సిలబస్ లోనూ మార్పులు చేయాలన్నారు. విద్యావిధానాన్ని అమలు చేస్తేనే యూజీసీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులొస్తాయన్నారు. అయితే దీన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. కార్పొరేటీకరణ, ప్రపంచీక రణతో విద్యావ్యవస్థ సంక్షోభంలో ఉందన్నారు.

విశ్వవిద్యాలయాలకు సరిపడా బడ్జెట్ కేటాయించట్లేదని పేర్కొన్నారు. వర్సిటీల్లో నియామక ప్రక్రియ కొంతకాలంగా ఆగిపోయిందని, సరిపడా ఫ్యాకల్టీ లేరని, ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు కమిట్‌మెంట్‌తో పనిచేయడం లేదని వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయాలు బాధ్యతాయుతమైన వ్యవస్థలని, వాటి ద్వారా ఎంతో సాధించొచ్చన్నారు. ప్రపంచంతో పోటీపడేలా వచ్చే ఐదు, పదేళ్ల అవసరాలకనుగుణంగా సిలబస్‌ను రూపొందించాల్సిన అవసరం ఉంద న్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించారని, ఉన్నత విద్యాభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. నల్సార్‌లో ఎన్నో కొత్త కోర్సులను విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారు ఇప్పుడు చాలా మంది ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, టాలెంట్ ఎవరి సొత్తు కాదన్నారు.

ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల అనుమతులు, ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఉన్నత విద్యామండలిలో చాలా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఒక్క రోజుతో ఏదీ సాధ్యం కాదని ఆయన చెప్పారు. తనకు వైస్ చైర్మన్‌గా నియిమించినందుకు ప్రొఫెసర్ ఐ పురుషోత్తం సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, మాజీ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ మాట్లాడుతూ.. ఉన్నత విద్యాభివృద్ధిలో తమకు సహకరించిన ఉద్యోగుల కు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

మండలి చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా విశేష సేవలందించిన ప్రొఫెసర్ ఆర్.లిం బాద్రి, వెంకటరమణలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్2 మహమూద్, సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.