నూతన పథకాల ప్రారంభోత్సవంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష...
సుల్తానాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రారంభించిన 4 నూతన పథకాలను క్రమ పద్ధతిలో చివరి లబ్ధిదారుడి వరకు అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, ఎలిగేడు మండలం శివపల్లి గ్రామాలలో నిర్వహించిన నూతన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... 4 నూతన పథకాలకు ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం అర్హులను ఎంపిక చేసి, సదురు వివరాలను పారదర్శకంగా గ్రామసభలో ప్రవేశపెట్టి ఆమోదించుకొని అమలు చేస్తున్నామని, గ్రామసభలో ప్రవేశపెట్టిన ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాలను మరోసారి విచారించి అర్హత ఉంటేనే అమలు చేస్తామని, అదే సమయంలో పథకాలు రాలేదని, అందిన ప్రతి దరఖాస్తులు పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలను లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి ఎటువంటి పరిమితి లేకుండా రైతు భరోసా పథకం అమలు అవుతుందని అన్నారు. కాట్నపల్లి గ్రామంలో 650 రైతులకు దాదాపు 50 లక్షల వరకు రైతులకు సాయం అందుతుందన్నారు.
2023-24 సంవత్సరంలో ఉపాధి హామీలు 20 రోజులు పని చేసిన భూమి లేని వ్యవసాయ కూలీలను రూ.50 మందు గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తున్నామని, కాట్నపల్లి గ్రామాలలో 176 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తున్నామని, అర్హులకు రేషన్ కార్డులు వస్తాయని, 4 పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా ఎంపిక కాని పక్షంలో ఎటువంటి ఆందోళన చెందకుండా మండలం ఎంపీడీవోకు దరఖాస్తు చేస్తే మరొకసారి పరిశీలించి తప్పనిసరిగా పథకం అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించామని, గత పది సంవత్సరాలలో ఒక ఇండ్లు కూడా శివపల్లి గ్రామానికి ఇవ్వలేదని, శివపల్లి గ్రామంలో నేడు 213 మందికి ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కొంత ఆలస్యమైనప్పటికీ నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కార్యచరణ ప్రారంభించిందని అన్నారు.
గతంలో పేదలకు పని కల్పించేందుకు చట్టబద్ధతను కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని, ఆ నిరుపేద భూమిలేని లబ్ధిదారులకు నేడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12000 సంవత్సరానికి సహాయం అందించేందుకు నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని, శివపల్లి గ్రామంలో 73 కుటుంబాలను ఎంపిక చేసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్పెషల్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.