కలెక్టర్ ఎం హనుమంతరావు...
యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదలకు అందేలా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు(District Collector Hanumantha Rao) అన్నారు. గురువారం ఆత్మకూర్ మండలంలోని రాయిపల్లి, కాప్రాయి పల్లి గ్రామం, మోత్కూర్ మండలంలోని మసిపట్ల గ్రామపంచాయతీ పరిధిలో శివ నగర్ హేమ్లెట్ గ్రామం, గుండాల గ్రామంలో నిర్వహిస్తున్న నాలుగు సంక్షేమ పథకాల (రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు(రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఇళ్లు) సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ హనుమంత రావు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వే తీరుని పరిశీలిస్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లడారు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందని, ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా, వ్యవసాయ యోగ్యమైన భూమి వుందా లేక రాళ్లు రప్పలు ఉన్నాయా అని తదితర వివరాలను సేకరించారు. అలాగే ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల పథకాలకు ప్రజలు దరఖాస్తు చేసుకోగా, ఆ దరఖాస్తులను ప్రభుత్వం తెలిపిన మార్గదర్శకాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే చేసి లబ్ధిదారులను గుర్తిస్తున్నారని పేర్కొన్నారు.
మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కాకపోతే విడతల వారీగా లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. అర్హులెవరూ కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. అదే విధంగా ఈ సర్వే ప్రక్రియ ఈ నెల 20న కొనసాగుతుందని, కుటుంబాల సమగ్ర వివరాలను తెలుసుకొని, ఆయా పత్రాలను పరిశీలించి, ఫార్మ్ లో నమోదు చేయాలని, ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, అయోమయానికి గురికాకుండా తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా పారదర్శకంగా, అత్యంత జాగ్రత్తగా నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల తహసీల్దార్ లు ప్రత్యేక అధికారి, ఆయా మండలాల, గ్రామాల ఎంపిడిఓలు, ఎంపీఓలు, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్ లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.