calender_icon.png 21 September, 2024 | 8:23 AM

స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండా ఎగరేస్తాం

21-09-2024 12:55:00 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): త్వరలో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు వస్తాయని, అక్కడ గులాబీ జెండా ఎగరేయడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాజయ్య సలహాలు, సూచనలు పంచుకున్నారు.

రాజకీయ స్వార్థంతో పార్టీ మారిన కడియం శ్రీహరిని ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు. ఇప్పటికే తాటి కొండ రాజయ్యను స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆయ న విజయం కోసం పనిచేస్తామని కేటీఆర్ అన్నారు. త్వరలోనే పార్టీ శ్రేణులతో కలిసి స్టేషన్ ఘన్‌పూర్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ప్రజాపాలనలో ప్రభుత్వోద్యోగులకు కష్టాలు

ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు కష్టాలు తప్పడం లేదని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పలు విషయాల్లో ఎక్స్ వేదికగా స్పందించారు. ఉద్యోగులను కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని, ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను అమలు చేయ డం లేదన్నారు. కాంగ్రెస్ మొండి వైఖరితో 20 లక్షల కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని పేర్కొన్నారు. మరో విషయమై స్పంది స్తూ  కాంగ్రెస్ పాలకులు ఎన్నికల సమయం లో రైతులు, కౌలు రైతులకు రైతుభరోసా ఇస్తామన్న హామీ ఒట్టిదేనని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. 

ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం రైతులను మోసగించినట్లేనని మండిపడ్డారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో అంబులెన్స్ అందుబాటులో లేక ఆరేండ్ల బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు 3 గంటలు చేతులపై ఎత్తుకొని వెళ్లిన ఘటన ఎంతో బాధించిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెద్దల పర్యవేక్షణలో వైద్యారోగ్య శాఖ పూర్తిగా నాసిర కంగా మారిందని ధ్వజమెత్తారు.