తెలంగాణను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధం
బీజేపీ అధికారంలోకి రాగానే సచివాలయ డోమ్‌లను కూల్చేస్తాం
కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): తెలంగాణలో వరద నష్టంపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయమిదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయని, నష్టాన్ని అంచనా వేసిన తర్వాత నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం వద్ద అందుబాటులో ఉన్న రూ.1,340 కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్ నిధుల వినియోగానికి సంబంధించి నిబంధనలను సడలించాలని రేవంత్ కోరారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుటుందని తెలిపారు. గత ప్రభుత్వం ఈ నిధులను వినియోగించు కోలేకపోయిందని, కానీ ఈసారి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
అధికారంలోకి రాగానే కూల్చేస్తాం..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయ డోమ్‌లను కూల్చేస్తామని గతంలో చేసిన ప్రకటనకు తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పిన బండి.. 9 అంతస్తుల సచివాలయంలో 3 అంతస్తుల మేర డోములను నిర్మించడమేందని ప్రశ్నించారు. కేసీఆర్ నవగ్రహ యాగం చేయడంపైనా తనదైన శైలిలో బండి సంజయ్ స్పందించారు. ‘కేసీఆర్ దశమ గ్రహం. తెలంగాణ ప్రజలకు దశమ గ్రహం పీడ విరగడైంది. పదేండ్లపాటు కేసీఆర్ సహా ఆయన కుటుంబమంతా అధికారాన్ని అనుభవించింది కదా.. ఇంకా దేనికోసం నవగ్రహ యాగం చేస్తున్నట్లు’ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఎస్డీఆర్‌ఎఫ్ నిధులను పక్కదారి మళ్లించిందన్నారు. కేంద్రం అందించిన సాయాన్ని కూడా వాడుకోలేదన్నారు. కేసీఆర్ తన కోసం కాకుండా ప్రజల కోసం యాగాలు చేస్తే బాగుండేదని, కానీ ఆయనకు ఆ ఆలోచనే లేదన్నారు. మళ్లీ సీఎం కావాలనే ఉద్యేశంతోనే యాగం చేస్తున్నరన్నారు.