calender_icon.png 28 November, 2024 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రజలనూ బాగుచేస్తాం

10-10-2024 02:33:14 AM

పరీవాహక ప్రాంత ప్రజలను దూరంగా పంపించం 

సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టించి ఇస్తాం

ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో బాధిత కుటుంబాల పిల్లలకు విద్య 

 మూసీ రివర్ ఫ్రంట్ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి  

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మురుగుతో నిండిపోయి ఉన్న మూసీని బాగు చేసినట్టే మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజలను బాగు చేయడానికి మూసీ ప్రక్షాళన అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌ను మూసీ పరీవాహక ప్రాంతాల వాసులకు వివరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు.

బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరిగా గాలికి వదిలేయకుండా, బాధ్యత కలిగిన ప్రభుత్వంగా వారికి ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

విశ్వ నగరంగా చెప్పుకొంటున్న హైదరాబాద్‌కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేసుకోవడంతోపాటు పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని స్పష్టంచేశారు. నగరంలో ఉన్న మూసీని ఒక ఆస్తిగా వాడుకోవాల్సి ఉండగా డ్రైనేజీ కాలువలాగా వదిలేశామని ఆవేదన వ్యక్తంచేశారు. భవిష్యత్తు తరాలకు మంచి నగరంగా హైదరాబాద్‌ను అందివ్వడానికి లండన్‌లో ఉన్న థేమ్స్ నది మాదిరిగా ప్రక్షాళన చేసుకుని అభివృద్ధి చేస్తామని అన్నారు.

మూసీ గర్భంలో నివసిస్తున్న ప్రజలను పరీవాహక ప్రాంతం నుంచి దూరంగా పంపించబోమని తెలిపారు. పట్టాలు ఉండి ఇండ్లు నిర్మించుకున్న వారిని, పట్టాలు లేకుండా గుడిసెలు వేసుకుని పరీవాహక ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలు తెలంగాణ బిడ్డలే కాబట్టి వారిని కూడా ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 

సమీప ప్రాంతాల్లోనే ఇండ్లు నిర్మిస్తాం

మూసీ పరీవాహక ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇండ్లను నిర్మించి బాధిత కుటుంబాలకు ఇస్తామని భట్టి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఇండ్లు కోల్పోతున్న పిల్లలకు మెరుగైన విద్యను అందిస్తామని చెప్పారు.

స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతోపాటు వారు వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి సహకారం అందిస్తామని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, సామాజిక సేవకుల సలహాలు, సూచనలు కూడా వింటామని చెప్పారు.

ప్రజలకు మేలు జరిగే సూచనలు, సలహాలు ఇస్తే వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి సూచనగా తెలిపారు. మూసీ సుందరీకరణ విషయంలో సీఎం ఆలోచనలు, అభివృద్ధి విజన్ ను ముందుకు తీసుకుపోయే విధంగా అధికారులు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించాఉ.

ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని, అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే నగరానికి నష్టంచేసిన వారవుతారని హితవు పలికారు. మూసీ పునరుజ్జీవం భవిష్యత్తు తరాల కోసమే తప్పా.. తమకు ఎలాంటి వ్యక్తిగత ఎజెండా లేనేలేదని స్పష్టంచేశారు.

ప్రభుత్వ ఆలోచనలను, మూసీ పరీవాహక ప్రజలను బాగు చేయాలని తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ర్ట పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు.