calender_icon.png 22 December, 2024 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకూ వెళ్తాం

10-07-2024 03:50:00 AM

  • పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్
  • రాజ్యాంగ పరిరక్షణ అంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోజులు
  • ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి):  రాష్ట్రంలో పార్టీ ఫిరాయిం పులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, ఈ వ్యవహారంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. ఓవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ అంటూ పోజులు కొడుతూ మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తిని చంపేలా ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం పార్టీ ఫిరాయింపులపై  మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు సురేష్‌రెడ్డి, దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆయారాం, గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీయేనని విరుచుకుపడ్డారు.

పాంచ్ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామని రాహుల్ గాంధీ గొప్పలు చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడ సభలో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన వారి సభ్యత్వం కోల్పోయేలా చేస్తామని చెప్పారని, కానీ అదే వేదికపై బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. రాహుల్ వ్యవహారం చూస్తుం టే ఆయనకు ఆస్కార్ లెవల్ అవార్డు ఇవ్వచ్చని ఎద్దేవా చేశారు. గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ మారవద్దని వారితో ప్రమా ణం చేయించారన్నారు. కర్నాటక, హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ నేతలు ఇప్పడు తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇళ్లచుట్టూ  తిరుగుతున్నా రని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టుకూ వెళ్తామని చెప్పారు.   

ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి మారితే రాళ్లతో కొట్టి చంపాలని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మరి ఇప్పడు ఎవరిని రాళ్లతో కొట్టి చంపాలో, ఎవరు పిచ్చి కుక్కో సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.  గతంలో మణిపూర్‌లో ఓ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌పై విచారణ ద్వారానే సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చిందన్నారు.  దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఫిరాయింపులపై పోరాటమంటూ తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొనుగోళ్లకు ఎందుకు పాల్పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందని సిద్ధరామయ్య ఆరోపించారు. మరి తెలంగాణలో ఎమ్మెల్యే కొనుగోళ్లలో ఎంత ఖర్చు పెడుతున్నారో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు. 

న్యాయ నిపుణులతో సంప్రదింపులు  

పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యా యం కోసం ఢిల్లీలో నాలుగు రోజులుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.  బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ తరువాత సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ బీ ఫామ్‌పై పోటీ చేశారని, ఇంత బహిరంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని, న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లుతామన్నారు.  రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ అంశం రాజ్యసభలో లేవనెత్తుతామని, అవకాశం ఉన్న అన్ని వేదికల్లో  న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ బాధిత పార్టీలతో కలిసి భవిష్యత్తులో పార్టీ  ఫిరాయింపుల చట్టం బలోపేతం చేసేందుకు పోరాటం చేస్తామన్నారు.  పాంచ్ న్యాయ్‌లో కాంగ్రెస్ చెప్పిన విధంగా పార్టీ మారగానే ఆటోమెటిక్‌గా సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తేవాలని కోరారు.

కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది

కాంగ్రెస్ పార్టీకి 2014కు ముందు తెలంగాణ ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికి ఆ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్నామన్నారు. 10 సంవత్సరాల పాటు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని చెప్పారు.  మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీల పేరుతో ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపించడంతో ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు 420 హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాటిని అమలు చేయడం చేతకావటం లేదన్నారు. దాని నుంచి తప్పించుకోవడానికే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్‌పై పోరాటంలో ఇదే తొలి అడుగు మాత్రమేనని, భవిష్యత్తుల్లో మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. 

ఫిరాయింపులతో తమ పార్టీ లాభపడ లేదు: మాజీ మంత్రి హరీశ్‌రావు 

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎప్పుడు వ్యాఖ్యలు చేయలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మా పార్టీలో చేరిన వారిలో 10 మంది ఓడిపోయారని, ఫిరాయింపులతో మాకు లాభం జరగలేదని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము ఎప్పుడు పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ఇతర పార్టీలకు ఇంటింటికి వెళ్లిన కండువాలు కప్పలేదని, తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.