బీఆర్‌ఎస్ నేతలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చురక
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అధికారంలో ఉంటే పను లు ఎక్కువగా జరుగుతాయని, ప్రచారం మాత్రం తక్కువగా ఉంటుందని.. బీఆర్‌ఎస్ వాళ్లు పబ్లిసిటికి దగ్గరగా.. పనికి దూరంగా ఉంటారని పీసీసీ వర్కింగ్ ప్రెపిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉండాలో తమ దగ్గరికి వస్తే ట్రెయినింగ్ ఇస్తామని చురకలంటించారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉండేందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోనే ఉన్నారని స్పష్టంచేశారు.
బుధవారం ఆయన గాంధీభవన్‌లో పార్టీ నేతలు భవానీరెడ్డి, దర్ఫల్లి రాజశేఖర్‌రెడ్డి, లింగంయాదవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు ప్రభుత్వం దృష్టికి సమస్యలు తేవాలని, ఆ తర్వాత పరిష్కారం అడగాలని సూచించారు. కానీ, బీఆర్‌ఎస్ నాయకులు అదేమీ చేయకుండా.. ముందుగానే ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వరద నష్టంపై ప్రధాని మోదీతోనూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని గుర్తుచేశారు. వరద బాధితులకు తక్షణ సాయం కింద రూ.10 వేలు సీఎం ప్రకటించారని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించి ప్రజల్లో విశ్వాసం నింపేలా పని చేస్తున్నామని చెప్పారు.
రాజకీయ పార్టీగా వరద ముంపు ప్రాంతాలకు వెళ్లడం తప్పు కాదని, రాజకీయం కోసం వెళ్లడం సరికాదని హరీశ్‌రావ్‌కు హితవుపలికారు. హరీశ్‌రావు కుటుంబం చంద్రబాబును ఎప్పుడు తిడుతుందో.. ఎప్పుడు పొగుడుతుందో తెలియ దన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో ఉండీ నడిపిస్తున్నాడు.. సీఎంగా ఉన్నా ఇంట్లో ఉండి నడిపించారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.