సివిల్స్‌లో తెలంగాణ సత్తా చాటాలి.. మా ప్రాధాన్యం విద్య, ఉద్యోగాలు, రైతు సంక్షేమం
అతి త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
ఇప్పటికే ౩౦ వేల ఉద్యోగ నియామక పత్రాలిచ్చాం
15 రోజుల్లో యూనివర్సిటీలకు కొత్త వీసీలు
ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులూ భర్తీ చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
సివిల్స్ అభ్యర్థులు 135 మందికి లక్ష చొప్పున చెక్కులు
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీపడే సివిల్ సర్వీసెస్ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అత్యధికంగా కేంద్ర సర్వీస్ పోస్టులు సాధించి దేశానికి ఆదర్శంగా నిలువాలని సూచించారు. ఈ ఏడాది తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికైన ౧౩౫ మంది అభ్యర్థులకు రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద రూ.౧ లక్ష చొప్పున సోమవారం చెక్కులు అందజేశారు.
సచివాలయంలో సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సివిల్స్ మెయిన్స్ పరీక్ష పాసై ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి కూడా రూ.౧ లక్ష సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం అభివృద్ధే ప్రధానాంశాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పది పదిహేను రోజుల్లో కొత్త వైస్ చాన్స్‌లర్లను నియమిస్తామని ప్రకటించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ౯౦ రోజుల్లోనే ౩౦ వేల ఉ ద్యోగాల భర్తీ చేసి ఎంపికైనవారికి నియామ క పత్రాలు ఇచ్చామని, త్వరలోనే మరో ౩౫ వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు.
మెయిన్స్ దాటితే మరో రూ.లక్ష
రాష్ట్రంలో ఎస్సు నియామకాలు చేపడితే సగం మంది ఉమ్మడి నల్లగొండ నుంచే ఎంపిక అవుతున్నారని, అందుకు కారణం ముందుగా అక్కడి నుంచి ఎంపికైన వారి స్ఫూర్తేనని సీఎం చెప్పారు. ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసిన వారంతా మెయిన్స్‌కు, ఆ తర్వాత ఇంటర్వ్యూకు అర్హత సాధించాలని, అంతిమంగా సివిల్స్‌కు ఎంపికై మీ ఊరివాళ్లకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిలో ముందు న్నా.. మనకంటే ఎంతో వెనుకబడిన బీహార్, రాజస్థాన్‌లతో పోల్చితే సివిల్స్ సాధనలో మనం వెనుకబడి ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి రూ.లక్ష సాయం అందించామని, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంట ర్వ్యూకు అర్హత సాధిస్తే మరో రూ.లక్ష అందిస్తామని ప్రకటించారు.
రాష్ర్ట ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ ఈ ప్రభుత్వం మీ వెనుక ఉందనే ఆత్మవిశ్వాసం కల్పించడానికి భరోసా ఇస్తున్నామని తెలిపారు. సివిల్స్ అభ్యర్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తనకు, మంత్రులకు తెలియజేయాలని, రాష్ర్ట ప్రభుత్వం తరఫున వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో సివిల్స్‌లో ఎంపికై రాష్ర్ట ప్రతిష్టను పెంచాలని ఆకాంక్షించారు. ‘మీరు మా బిడ్డలనే విషయం తెలియజేయడానికే ఈ కార్య క్రమాన్ని సచివాలయంలో నిర్వహించాం’ అని సీఎం తెలిపారు.
పది పదిహేను రోజుల్లో కొత్త వీసీలు, ప్రొఫెసర్లు
పది, పదిహేను రోజుల్లోనే రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్స్‌లర్లు, ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్నగా తాను అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. కొందరి మాయమాటల ప్రభావంలో పడి నిరసనలు, ధర్నాలకు దిగొద్దని, వారి కుట్రలకు పావులుగా మారొద్దని సూచించారు. ‘ప్రభుత్వం ఏం చెబుతోంది.. ఏం చేస్తోంది.. వాళ్లేం చెబుతున్నారు.. ఏం చేస్తున్నారనే దానిపై సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి’ అని సూచించారు. ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యలు తీసుకువచ్చినా సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తానని, వినేం దుకు ముందుంటామని హామీ ఇచ్చారు.
విద్యార్థులను కావాలనే రెచ్చగొడుతున్నారు
విద్యార్థులకు, విద్యా రంగానికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నా కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయించాలని విద్యార్థులతో ఆందోళలతో చేయిస్తున్నారని మండిపడ్డారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం ఉండదని, వాటికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నష్టపోతారని గుర్తుచేశారు. గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి, వారి ప్రాణాలు తీసి రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పదేళ్ల పాటు ఉద్యోగ కల్పనను పట్టించుకోనివారు, తమ ఉద్యోగాలు పోగానే మళ్లీ విద్యార్థులను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారని బీఆర్‌ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పరీక్షల వాయిదా వేయాలంటూ విద్యార్థులను రెచ్చగొట్టే బావ బామ్మర్దులు... వాళ్లే ఆమరణ దీక్ష చేయాలని తాను సూచించానని సీఎం తెలిపారు.
వాళ్ల ప్రాధాన్యత వేరు
గతంలో సచివాలయంలోకి తనను, సీతక్క వంటి వారినే రానివ్వలేదని సీఎం తెలిపారు. సచివాలయం గఢీ కాదని.. మీరు దూరం నుంచి దీనిని చూసే పరిస్థితి రావద్దనే, మీలో స్ఫూర్తి నింపేందుకే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశామని సివిల్స్ అభ్యర్థులకు తెలిపారు. గత ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా ఇటువంటి పనులు ఏం చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యం విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, రైతు సంక్షేమమైతే.. గత ప్రభుత్వ ప్రాధాన్యం టీవీలు, పేపర్లు, ఫాంహౌస్‌లు, ఇతర కార్యక్రమాలని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి విమర్శించారు.
గత పదేళ్లలో చేయని రుణమాఫీ తమ ప్రభు త్వం నెల రోజుల్లో పూర్తి చేసిందని చెప్పారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన 135 మంది సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు అందజేసిన అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. 29 జిల్లాల నుంచి 135 మంది సివిల్స్ మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 113 మంది, మహిళలు 22 మంది ఉన్నారు. మొత్తం 172 మంది దరఖాస్తు చేసుకోగా కొంతమంది సాంకేతిక సమస్య కారణంగా సోమవారం 135 మందికే చెక్కులు పంపిణీ చేశారు. త్వరలో మిగిలిన వారికి కూడా పంపిణీ చేస్తామని సింగరేణి సీఎండీ బలరాం చెప్పారు.
గతంలో ఎవరూ చేయని విధంగా
గతంలో ఏ ప్రభుత్వమూ ఆలోచన చేయని విధంగా సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం నిరుద్యోగులపై తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతులకు తక్కువ నిధులను ఖర్చు చేసిందని విమర్శించారు. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మంత్రి పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారందరూ మెయిన్స్‌లోనూ విజయం సాధించి సివిల్స్‌కు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సూచనలను అభ్యర్థులకు అందిస్తే బాగుంటుందని సీఎంకు మంత్రి సూచించారు. అనంతరం సూర్యాపేటకు చెందిన సివిల్స్ అభ్యర్థి ప్రీతి, నల్లగొండకు చెందిన నిఖిత మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం గొప్పవిషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, గండ్ర సత్యనారాయణరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, కవ్వంపల్లి సత్యానారాయణ, ఖమ్మం, పెద్దపల్లి ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, గడ్డం వంశీ, సింగరేణి సీఎండీ బలరాం, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.
ఒలంపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా క్రీడా వర్సిటీ
ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో చిన్నచిన్న దేశాలు పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తే... 140 కోట్ల జనా భా ఉన్న మన దేశం మాత్రం ఆశించిన స్థాయిలో సాధించలేదని, ఇది ఒక రకంగా మనకు అవమానక రమే నని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్లానని, ఆ యూనివర్సిటీలో శిక్షణ పొందిన వారు 19 పతకాలు సాధిస్తే, ఒక మ హిళా క్రీడాకారిణి ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సాధించిందని తెలిపారు. రాబోయే ఒలింపిక్స్‌లో మన యువత సైతం పెద్ద సంఖ్యలో పతకా లు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రూపకల్పన చేస్తున్నట్లు చెప్పారు. ఈ యూనివర్సి టీ నుంచి అత్యధిక పతకాల సాధన ద్వారా తెలంగాణ దేశానికే తలమానికంగా నిలవాలని ఆయన ఆకాం క్షించారు.
100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
గత ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహించారని, రెండుమూడు వందల మంది విద్యార్థులుంటే ఒకటిరెండు బాత్‌రూంలతో సరి పెట్టారని మండిపడ్డారు. తాము మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యాసంస్థలన్నీ ఒకే కాంపౌండ్‌లో ఉండేలా 20 నుంచి 25 ఎకరాల్లో రాష్ర్టంలో వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ పేరుతో నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం బడ్జెట్‌లో ఈ ఏడాది రూ.5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
‘మేం కేంబ్రిడ్జిలో, ఆక్స్‌ఫర్డ్‌లో, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియాలో చదువుకున్నామని ఎలాగైతే గర్వంగా చెప్పుకుం టున్నారో.. భవిష్యత్‌లో కూడా తాము ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుకున్నామని విద్యార్థులు చెప్పుకునేలా వాటి ని తీర్చిదిద్దుతాం’ అని పేర్కొన్నారు. మన విద్య సర్టిఫికేట్లకే పరిమితమవుతోందని, వేలాది మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటంలేదని తెలిపారు. మరోవైపు నైపు ణ్యం ఉన్నవారు లభించక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు.
ఈ సమస్య పరిష్కారానికి, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినట్టు వివరించారు. స్కిల్ యూనివర్సిటీలో అన్ని సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఉంటాయని, ఈ ఏడాది విద్యా సంవత్సరం వృథా కాకుండా 2 వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని వివరించారు.