ఎఐటియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాదుని సుదర్శన్
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా కార్మికులకు తమ యూనియన్ ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని ఏఐటియుసి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాదుని సుదర్శన్ స్పష్టం చేశారు. ఏరియా స్టోర్స్ లో సోమవారం నిర్వహించిన స్టేట్ మీటింగ్ లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈనెల 28వ తేదీన గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో సింగరేణి యాజమాన్యానికి కొత్తగూడెంలో సెంట్రల్ స్ట్రక్చర్ కమిటీ సమావేశం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ కోల్ ఇండియా మాదిరిగా యాజమాన్యమే భరించాలని, కార్మికుల సొంతింటి కల సాకారం చేయడం, ప్రమోషన్ పాలసీపై యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి అమలుకు కృషి చేస్తామన్నారు.
ఏరియా స్థాయిలో స్ట్రక్చర్ సమావేశం జరుగుతుందని ఈ సమావేశంలో ఏరియా స్థాయి కార్మికుల డిమాండ్లు పరిష్కరిస్తామన్నారు. అనంతరం స్టోర్ లో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్టోర్స్ డివైజయం పైడిశ్వర్ కి వినతిపత్రం అందజేశారు. స్టోర్స్ పిట్ కార్యదర్శి కె ఓదెలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎగ్గెటి రాజేశ్వరరావు, వర్క్ షాప్ పిట్ కార్యదర్శి సిహెచ్పి శర్మ, నాయకులు బియ్యాల తిరుపతి, సదానందం, రామకృష్ణ, వెంకటేశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.