21-04-2025 12:26:45 AM
పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవన్‌రెడ్డి
సిద్దిపేట, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సిద్దిపేట జిల్లా ప్రధాన కోర్టుకు మొదటి సారి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం తనకు అవకాశం కల్పించిందని అడ్వకేట్ జీవన్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా తన వంతుగా ప్రభుత్వానికి సహకారం అందిస్తానన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడడంతోపాటు నిందితులకు శిక్ష పడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.
బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న వాటిని తీరుస్తానన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో ఇప్పటివరకు చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని వాటిపై దృష్టి సారించి కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. క్షణికావేశంతో చేసిన నేరాల వల్ల ఎంతోమంది కుటుంబాలకు దూరమవుతున్నారనీ, నేరాలకు పాల్పడిన వారందరికీ శిక్షలు పడేలా చేసి, ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఈ సమావేశంలో అడ్వకేట్ పత్రి ప్రకాష్, ఖలిముద్దీన్ పాల్గొన్నారు.