అధికారులదే బాధ్యత..
తరుగు లేకుండా తడిసిన ప్రతి గింజ కొనేదాకా పోరాటం
వనపర్తి టౌన్, మే 24 : వనపర్తి జిల్లా కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడిచేందుకు అధికారులే బాధ్యులని, తడిసిన ప్రతి గింజ కొనేదాకా రైతుల పక్షాన పోరాడుతామని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ హెచ్చరించారు. ఆదివారం వనపర్తి మండలం చిట్యాల మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో 35 వేల బస్తాల ధాన్యం కాంటా వేసి లారీలు రాక నిల్వ ఉంచారన్నారు. సుమారు 6 వేల బస్తాల ధాన్యం ఇంకా తూకం వేయాల్సి ఉందన్నారు. మార్కెట్ యార్డు మైదానం పలుచోట్ల పల్లంగా ఉందని వర్షం వచ్చిన ప్రతిసారి నీరు నిలుస్తుందన్నారు. మార్కెట్ యార్డులో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి లేదన్నారు. మరుగుదొడ్లున్న నీళ్లు లేక దుర్వాసన కొడుతున్నా యని మహిళలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే బాగు చేయాలన్నారు. రైతుల సమస్యలు తీరేవరకు సిపిఐ పోరాడుతుందన్నారు. సిపిఐ నాయకులు శేఖర్, వంశీ రైతులు పాల్గొన్నారు.






