calender_icon.png 15 November, 2024 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచానికి తిండిపెడతాం

04-08-2024 02:42:33 AM

భారత్ ఆహార మిగులు దేశంగా మారింది

ఏసీఏఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, ఆగస్టు 3: భారత్ ఆహార మిగులు దేశంగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతకు, పోషకాహార సమస్యలకు పరిష్కారాన్ని వెతికేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న 32వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిస్ట్స్(ఐసీఏఈ) సమ్మిట్‌ను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్‌లో సుస్థిర, వాతావరణాన్ని తట్టుకోగలిగే వ్యవసాయంపై దృష్టి సారించామని తెలిపారు. 

కొరత నుంచి సమృద్ధి స్థితికి

భారత్‌కు స్వాతంత్య్రం లభించినప్పుడు ఆహారానికి తీవ్ర కొరత ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో సమృద్ధి సాధించాం. పాలు, పప్పులు, మసాలా దినుసుల ఉత్పత్తిలో దేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. ఆహారధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ ఉత్పత్తిదారుల్లో రెండో అతిపెద్ద దేశంగా అవతరించింది. ఒకప్పుడు భారత ఆహార భద్రత ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రత, పోషకాహార భద్రతకు పరిష్కారాలు సాధించేందుకు భారత్ కృషి చేస్తోంది. ఈ కారణాల వల్ల ఆహార వ్యవస్థ పరివర్తనపై చర్చలకు భారత అనుభవం విలువైనది. ఇది ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది అని సదస్సులో మోదీ పేర్కొన్నారు.