calender_icon.png 10 March, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతన్నల ప్రతిష్ఠ పెంచుతాం

10-03-2025 01:06:01 AM

రైతన్నల మాదిరిగా ప్రాధాన్యం

  1. మహిళా సంఘాల సభ్యులకు అందించేందుకు 1.30కోట్ల చీరలకు ఆర్డర్ మీకు కావాల్సిన పనులు చేయించుకోండి
  2. అభివృద్ధి ప్రణాళికలతో రండి.. ఆమోదించే బాధ్యత నాదే
  3. రాహుల్ మాట మేరకు ఏడాదిలోనే కులగణన చేశాం
  4. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి బీజేపీ మెడకు..
  5. ఆసిఫాబాద్‌లోని మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్‌బాపూజీ పేరు పెడతాం 
  6. బాపూజీ చనిపోతే కూడా కేసీఆర్ వెళ్లలే 
  7. షోలాపూర్‌లో రూ.కోటితో మార్కండేయ భవన్ నిర్మిస్తాం
  8. అఖిల భారత పద్మశాలీ మహాసభలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 9 (విజయక్రాంతి): రైతన్నల మాదిరిగా నేతన్నలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందరి ఆశీర్వాదంతో తాను ముఖ్యమంత్రి అయ్యానని, దానికి కారణమైన ప్రజల రుణం తీసుకుంటానన్నారు. ‘మీ సోదరుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు.

మీకు కావాల్సిన పనులు చేయించుకోండి..మీ అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలతో రండి..వాటిని ఆమోదించే బాధ్యత తనది’అని స్పష్టం చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో పిట్టలను వెళ్లగొట్టేందుకు ఉపయోగిస్తున్నారన్నారు.  నేతన్నలకు అప్రతి ష్ట రావొద్దని తాము భావించామని, అం దుకే రాష్ట్రంలోని 60లక్షల మంది మహి ళా సంఘాల సభ్యులకు 1.30కోట్ల చీరల కోసం నేతన్నలకు ఆర్డర్ ఇచ్చామని వెల్లడించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే కులగణన పూర్తిచేశామని చెప్పారు. ఆసిఫాబాద్‌లోని మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతామని తెలిపారు. షోలాపూర్‌లోని నేతన్నల కోసం రూ.కోటి నిధులతో మార్కండేయ భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. 

పకడ్బందీగా బీసీల లెక్కలు తీశాం..

దేశంలో బ్రిటీషు పాలనలో 1931లో కులగణన చేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 1979లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్లు పెంచిందని చెప్పారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులాల వారీగా లెక్కలు తీశామని వాటిని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ తొక్కిపెట్టిందని ఆరోపించారు. ఇచ్చిన మాటమేరకు రాష్ట్రంలో పకడ్బందీగా బీసీల లెక్కలు తీశామని తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. 60రోజుల పాటు జరిపిన సర్వేలో 1.30లక్షల మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు. దాదాపు లక్షమంది ఎన్యుమరేటర్లు, 37వేల మంది డాటా ఏంట్రీఆపరేటర్లు పాల్గొన్నారని తెలిపారు. కులగణన నచ్చనివారు సర్వేపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి మెడకు చుట్టుకుంటుందని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలకు భయమని విమర్శించారు.

గతంలో కేసీఆర్ నిర్వహించిన సర్వేలో 51శాతం మంది బీసీలు మైనార్టీల తో కలిపి, 22శాతం ఓసీ కులాల వారున్నట్లు వెల్లడైందన్నారు. తాము ఇటీవల నిర్వహించిన సర్వేలో బీసీలు 56.63శాతం, ఓసీలు 15.25శాతం ఉన్నట్లు తెలిపారు. రిజర్వేషన్లపై 50శాతం నిబంధనను తొలగిస్తామని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 

కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోయినా.. చూసేందుకు కేసీఆర్ వెళ్లలేదు 

తెలంగాణ ఉద్యమం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో త్యాగాలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. లక్ష్మణ్ బాపూజీ చనిపోయినా ఆయన్ను చూసేందుకు కేసీఆర్ వెళ్లలేదని విమర్శించారు.  గత పాలకుల కుటుంబ సభ్యులు జోలెపట్టుకుని సిరిసిల్లకు వస్తే ఓట్లు, నోట్లు వేసి రాజకీయ నీడనిచ్చింది పద్మశాలీలేనని చెప్పారు.

తెలంగాణ ఏర్పాటయ్యాక పదేండ్లపాటు రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే కేంద్రప్రభుత్వంతో మాట్లాడి ఐఐహెచ్‌టీని తీసుకొచ్చామన్నారు. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని చెప్పారు. తెలంగాణ సాధన, నిర్మాణంలో పద్మశాలీల పాత్ర గొప్పదని కొనియాడారు. షోలాపూర్, బీవండి, వర్లీ ప్రాంతాల్లోనూ పద్మశాలీలు కీలకశక్తిగా ఉన్నారన్నారు.

వరంగల్ మేయర్‌గా గుండు సుధారాణిని కొనసాగేందుకు తాము సహకరించామన్నారు. గతంలో రాపోలు ఆనం ద్‌భాస్కర్ ఎంపీగా ఎన్నికయ్యేందుకు సోని యా సహకరించారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నపుడు ఆలె నరేంద్రను కేంద్రమంత్రిగా చేశారని, దృతరాష్ట్ర కౌగిలితో కేసీఆర్ ఆయనను ఖతం చేసిన కథ పద్మశాలీలందరికీ తెలిసిందేనని విమర్శించారు.

రాష్ట్రంలోని పద్మశాలీలు అన్నిరకాలుగా అభివృద్ధి చెందేలా తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అఖిల భార త పద్మశాలీ మహాసభ అధ్యక్షుడు కందకట్ల స్వామి, నాయకులు అనిల్, కమంతపు ము రళి, నరహరి, తదితరులు పాల్గొన్నారు. 

చేనేత కార్మికులకు లక్ష రుణమాఫీ

  1. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  2. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు వర్తింపు
  3. రూ.33 కోట్లకు ప్రాథమిక అనుమతులు మంజూరు

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కార్మికుడికి రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకోసం రూ.33 కోట్ల నిధులకు ప్రభుత్వం ప్రాథమిక అనుమతులిచ్చింది.

2017, ఏప్రిల్ 1 నుంచి 2024, మార్చి 31 వరకు ఉన్న రుణాలకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సర్కార్ ఆదివారం జారీచేసింది. గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లోని జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ఈ క్రమంలోనే రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి.. తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు చేనేత కార్మికులు చేనేత సంఘాలు, అన్ని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. బీఆర్‌ఎస్ సర్కార్ సైతం 2017లో చేనేత కార్మికులకు రుణమాఫీ చేసింది. జిల్లా సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది.