calender_icon.png 8 January, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సహిస్తాం

07-01-2025 02:00:57 AM

  1. చిప్‌ల తయారీ పరిశ్రమలకు హైదరాబాద్ బెస్ట్
  2. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): చిప్‌ల తయారీ, దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమైనదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. సరైన ప్రతిపాదనలతో వస్తే తాము పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

సోమ వారం సచివాలయంలో పీటీడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, పునర్నిర్మాణం, ఆటోమేషన్, పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు ప్రాంతీయ కార్యాలయం సింగపూర్‌లో ఉందని తెలిపారు.

హైదరాబాద్‌లో పరిశ్రమను ఏర్పాటు చేస్తే.. ప్రభుత్వం విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు కొదవ లేదని వివరించారు.

రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ క్లస్టర్ మొదటి దశ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్టు పీటీడబ్ల్యూ గ్రూప్ ఏషియా విభాగం టార్ స్టెన్ సెయ్ ఫ్రైడ్ మంత్రికి వివరించారు. సమావేశంలో సంస్థ స్థానిక భాగస్వామి బార్ ట్రానిక్స్ ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, సింగపూర్‌కు చెందిన కన్సల్టెంట్ సంస్థ ‘టాప్ 2 పీటీఈ’ సీఈవో రావు పనిదపు తదితరులు పాల్గొన్నారు.

రమేశ్ బిధూరి వ్యాఖ్యలుసంస్కరహీనం  

బీజేపీకి మహిళలంటే కనీస గౌరవం లేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఢిల్లీలోని కల్కాజీలో రోడ్ల గురించి చెబుతూ ప్రియాంకాగాంధీని అవమానించేలా మాట్లాడిన  బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి చేసిన అసందర్భ వ్యాఖ్యలను సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే వారి గొప్పతనం ఏంటో తెలుస్తుందని హితవుపలికారు.

అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తుల గురించి సంస్కరహీనంగా మాట్లా డం ఎంత వరకు సమంజసమో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. భారతీయ సమాజంలో మహిళలకు గొప్ప స్థానముందని, భారతీయ సంస్కృతిని పరిరక్షించేది తామే అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నాయకులు బిధూరి చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మహిళను గౌరవించలేని బిధూరికి టికెట్ ఎందుకిచ్చారో బీజేపీ అగ్రనేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.