13-03-2025 12:02:28 AM
తహసీల్దార్ తబిత
నాగర్ కర్నూల్ మార్చి 12 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ లో విలీనమైన నెల్లికొండ రెవెన్యూ గ్రామంలో నిజమైన పట్టాదారు రైతులకు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని నాగర్ కర్నూల్ తాసిల్దార్ తబిత అన్నారు. బుధవారం గ్రామంలోని సర్వేనెంబర్ 363 లోని పట్టాదారుల పూర్తి వివరాలను గుర్తించేందుకు గ్రామంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా 363 సర్వే నెంబర్లు మొత్తం విస్తీర్ణం 478.29 గుంటలు కాగా ఇందులో 40.28 గుంటల భూమి దేవాదాయ శాఖకు సంబంధించిందని పేర్కొన్నారు. మరో 35 ఎకరాలు వ్యవసాయ మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించబడిందని పేర్కొన్నారు.
1997లో 92 మంది రైతులకు ఓఆర్సి ప్రభుత్వం ఇచ్చిందని అందులో క్రయవిక్రయాలు జరుపగా మొత్తం విస్తీర్ణంలో కొంత ఆక్రమణకు గురి కావడంతో పాటు సర్వే నెంబర్ లోని విస్తీర్ణం పెరిగినట్లు ఆరోపణలొచ్చాయి. అదే గ్రామ శివారులోని చెరువు కుంటలను కబ్జాలు చేసి విలాసవంతమైన భవనాలు కూడా నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేపథ్యంలో గత ప్రభుత్వం రైతులకు పట్టా పాస్ పుస్తకాలను నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు.
దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆ గ్రామ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు వచ్చేలా కృషి చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించి విచారణ ప్రారంభించారు. అనంతరం సర్వేనెంబర్ సంపూర్ణంగా సర్వే చేసి నిజమైన పట్టాదారులకు న్యాయం చేసేలా కృషి చేస్తామని తాసిల్దార్ పేర్కొన్నారు. వారి వెంట డిప్యూటీ తాసిల్దార్ సుదర్శన్ రెడ్డి గ్రామస్తులు ఉన్నారు.