calender_icon.png 23 October, 2024 | 10:06 AM

పేద రైతులకు న్యాయం చేస్తాం

12-09-2024 01:17:40 AM

  1. వక్ఫ్ బోర్డు చట్టంలోని లోపాలు సవరించేందుకు కమిటీ ఏర్పాటు 
  2. కమిటీకి రైతుల సమస్యలను వివరిస్తాం 
  3. వక్ఫ్ భూ బాధితులతో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ

సంగారెడ్డి, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి)/జహీరాబాద్: వ్యవసాయ భూములను వక్ఫ్ భూములుగా మార్చడంతో పేద రైతులకు అన్యాయం జరిగిందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం జహీరాబాద్‌లో వక్ఫ్ భూ బాధితు లు భారీ ర్యాలీ నిర్వహించి ఓ ఫంక్షన్ హాల్‌లో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. కొందరు రైతులకు చెందిన భూము ల రికార్డుల్లో వక్ఫ్ భూములు అని రావడంతో బిడ్డల పెళ్లిళ్లకు కూడా వాటిని అమ్మే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

ఒక్క జహీరాబాద్ డివిజన్‌లోనే 13 వేల ఎకరాల భూమి వక్ఫ్ భూములుగా రికార్డుల్లో నమోదైనట్లు ఎంపీ తెలిపారు. పేద రైతులకు న్యాయం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్న లోపాలను సవరించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వక్ఫ్ చట్టం సవరణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు హైదరాబాద్‌కు వస్తారని, రైతుల సమస్యలు కమిటీ ముందు ఉంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి, డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు విజయమోహన్ రెడ్డి, సీపీఎం నాయకుడు రాంచందర్‌తో పాటు న్యాయవాదులు, రైతులు పాల్గొన్నారు.