- జాతీయ రహదారి విస్తరణ పనుల్లో 29 ఇండ్ల కూల్చివేత
- నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత
చారకొండ, ఫిబ్రవరి 4: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ముందస్తు గా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పేద ల ఇండ్లను అధికారులు కూల్చివేశారు. “మీ కాళ్లు మొక్కుతం సారూ.. మా ఇళ్లను కూల్చకండి...” అంటూ బాధితులు పోలీసుల కాళ్ల పై పడి ప్రాథేయపడినా పట్టించుకోలేదు.
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రం నుంచి మర్రిపల్లి గ్రామానికి 1.2 కిలోమీటర్ల దూరం వరకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి అధికారులు సర్వే చేశారు. దీని లో భాగంగా 29 ఇళ్లను కూల్చివేయాల్సి వస్తుందని గుర్తించి మార్కింగ్ చేశారు. తమ ఇళ్ల మీదుగా జాతీయ రహదారి నిర్మాణం చేపట్టవద్దని బాధితులంతా నాలుగేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం సుమారు 400మంది పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారులు 29 ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. 29 ఇళ్లకు ప్రభుత్వం ఇంటిస్థలం, నిర్మాణం ఆధారంగా పరిహారాన్ని ప్రకటించింది. అయితే గుండె అనసూయ, గుండె బాలయ్య, కనక గిరిజ, గుండె రామస్వామి, నూనె విష్ణు..5 మంది బాధితులు మాత్రం పరిహారం తీసుకునేందుకు నిరాకరించారు.
అయినా అధికారులు వారిని ఒప్పించకుండా..ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. ఈక్రమంలో బాధిత కుటుంబాల చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు వాహనాలకు అడ్డుతగిలినా వారిని అక్కడినుంచి లాక్కెళ్లి మరీ ఇళ్లను కూల్చేశారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
బాధితులందరిని వెల్డండ పోలీస్ స్టేషన్‌కు తరలించి ఇళ్లల్లోని సామగ్రిని, దగ్గర్లోని రైతు వేదికలకు తరలించారు. కూల్చివేతల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, స్థానిక ఎస్సై శంశుద్దీన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముందస్తు సమాచారం ఇవ్వలేదు..
నా ఇంటి స్థలం 161 గజాల్లో ఉంది. కానీ అధికారులు 101 గజాలకు మాత్రమే పరి ఇస్తామన్నారు. రూ.2లక్షలు ప్లాట్‌కు, 14లక్షలు ఇంటికి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ డబ్బులతో బయట ఒక్క ప్లాట్ కూడా రాని పరిస్థితి. మాకు డబ్బులు వద్దు.. మా ఇల్లు కూల్చోద్దని వేడుకున్నా పట్టించుకోలేదు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా కండ్ల ముందే ఇళ్లను కూల్చేశారు.
గుండె అనసూయ,
నిర్వాసితురాలు