పెద్దపల్లి,(విజయ క్రాంతి): పెద్దపల్లి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని మసీద్ చౌరస్తా నుండి అమర్ చంద్ విగ్రహం వరకు, పైడబజార్ నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు రోడ్డు విస్తరణలో, ఎల్లమ్మ గుండమ్మ చెరువు హనుమాన్ టెంపుల్ చౌరస్తా నుండి ఎల్లమ్మ టెంపుల్ వరకు రోడ్ల నిర్మాణం కోసం జరుగుతున్న పనులపై మున్సిపల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో అంతర్గత రోడ్లను కలుపుతూ సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసే ఆలోచన చేయడం జరుగుతుందని, ప్రధాన రహదారుల వెంట సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు.
గతంలో మాదిరిగా కాకుండా రోడ్ల నిర్మాణలు డిజిటలైజేషన్ సిస్టంలో వేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రోడ్ల విస్తరణకు చర్యలు చేపడతామన్నారు. వచ్చే నెలాఖరులోగా పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు దశల వారిగా ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి పట్టణ అభివృద్దికి ప్రజలు సహకరించాలని కోరారు. అభివృద్ది, సంక్షేమమే అజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.