calender_icon.png 25 September, 2024 | 3:47 AM

మత రాజకీయాలపట్ల కఠినంగా వ్యవహరిస్తాం

25-09-2024 02:04:01 AM

త్వరలో ఆదిలాబాద్‌లో ఉమ్మడి సమావేశం

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మత రాజకీయాల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సీతక్క స్పష్టంచేశారు. జైనూర్ ఘటన నేపథ్యంలో మైనార్టీ వర్గానికి చెందిన పెద్దలతో మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారితో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. సమస్య మూలాలతోపాటు పరిష్కారాలను సూచించాలని కోరగా మైనా ర్టీ పెద్దలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

వ్యక్తిగత విభేదాలకు మతం రంగు జోడించి చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయని, ఆ శక్తులను కట్టడి చేసేలా బందోబస్తు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నిజాం హయాం నుంచి ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో సఖ్యతగా మెదిలిన ఆదివాసీ, మైనార్టీ వర్గాల మధ్య విభేదాలు తలెత్తడం పట్ల విచారం వ్యక్తం చేశారు.

సమస్య మూలాలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు. కొంత మంది యువకులు చేస్తున్న చేష్టలను చూపి మైనార్టీల పట్ల వ్యతిరేక భావనను కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపి ంచారు. అందుకే మైనార్టీ యువతకు అవగాహన కల్పించాలని అన్నారు. ఆదివాసీ చట్టాలను, మహిళలను గౌరవించేలా ప్రార్థన మందిరాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఏదైనా సమస్య తలెత్తితే శాంతియుతంగా నిరసన తెలపాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి ఎవరు తీసుకున్న ఉపేక్షించమని స్పష్టంచేశారు. వర్గాలు మధ్య గొడవలు జరిగితే అభివృద్ఢి కుంటుపడుతుందని చెప్పారు. రెండు వర్గాల మధ్య నెలకొన్న అపనమ్మకాన్ని పోగొట్టేలా ఇరుపక్షాల పెద్దలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.