calender_icon.png 9 October, 2024 | 7:57 AM

దేశానికి సంపద సృష్టిస్తాం

30-08-2024 12:00:00 AM

  1. వ్యక్తిగత, కుటుంబ ఐశ్వర్యానికి ప్రాధాన్యం లేదు
  2. ఏజీఎంలో ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ

ముంబై, ఆగస్టు 29: తాము సంపదను దాచుకోమని, వ్యాపారాల్ని విస్తరించి దేశానికి సంపదను సృష్టిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు.  రిలయన్స్ వ్యాపారాలు దానధర్మాల ద్వారా లభించలేదని, అట్టడుగుస్థాయి నుంచి నిర్మించామని తెలిపారు. ఆయిల్ రిఫైనింగ్, చమురు, సహజవాయువుల ఉత్పత్తి, పెట్రోకెమికల్స్, టెలికాం, రిటైల్, మీడియా వ్యాపారాల్లో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వల్పకాలిక లాభాల కోసం లేదా సంపదను దాచుకో వడానికి చూడదని, కానీ అందుకు బదులుగా దేశానికి సంపదను సృష్టిస్తుందని,  దేశానికి ఇంధన భద్రత కల్పిస్తుందని 67 ఏండ్ల అంబానీ గురువారం ఆర్‌ఐఎల్ వార్షిక షేర్‌హోల్డర్ల సమావేశంలో (ఏజీఎం)లో వివరించారు.

తన దృష్టిలో వ్యక్తిగత, కుటుంబ సంపదకు ప్రాధాన్యత లేదన్నారు. రిలయన్స్ దివ్వె ను తదుపరి తరానికి బదిలీ చేయడంమీద కసరత్తు చేస్తున్నానని అన్నారు. ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానంలో కుమార్తె ఇషా రిటైల్ వ్యాపారాన్ని, ఆమె కవల సోదరుడు అకాశ్ టెలికాంను, చిన్న కుమారుడు అనంత్ న్యూ ఎనర్జీ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ముకేశ్ 112 బిలియన్ డాలర్ల సంపదలో చాలావరకూ ఆర్‌ఐఎల్‌లో ఆయనకు ఉన్న వాటా ద్వారా లభించిందే. ‘స్వల్పకాలిక లాభాల్ని సంపాదించడం, సంపదను దాచుకునే వ్యాపారంలో మేము లేము. భారత్‌కు సంపదను సృష్టించడం, భారతీయ వినియోగదారుల జీవనాన్ని సులభతరం చేసే అత్యున్నత నాణ్యతా ఉత్పత్తులను, సేవల్ని అందించే వ్యాపారంలో ఉన్నాం’ అని అంబానీ చెప్పుకొచ్చారు. జాతికి ఇంధన భద్రత కల్పించే పనిలో ఉన్నామని ప్రకటించారు. 

టాప్‌ణ్ ప్రపంచ కంపెనీల్లో రిలయన్స్

నేడు రిలయన్స్ ప్రపంచంలో అత్యంత విలువైన టాప్ కంపెనీల జాబితాలో రిలయన్స్ చేరిందని తెలియచేయడానికి తాను సంతోషిస్తున్నానని షేర్‌హోల్డర్లతో అంబానీ చెప్పారు. 2018 జూలైలో రిలయన్స్ 100 బిలియన్ డాలర్ల విలువను దాటిందని, కేవలం ఆరేండ్లలో 250 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన తొలి భారతీయ కంపెనీగా అవతరించిందన్నారు. తమ స్వర్ణోత్సవ సంవత్సరమైన 2027లో రిలయన్స్ విలువ రెట్టింపు అవుతుందని వాగ్దానం చేస్తున్నానని చెప్పారు.

తమ ఐదు ప్రధాన వృద్ధి వ్యాపారాలైన ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ), రిటైల్, టెలికాం, మీడి యా, గ్రీన్ ఎనర్జీల ఒక్కోదాని విలువ 100 బిలియన్ డాలర్లను మించిందని, అవి మరింత వేగంగా వృద్ధిచెందుతాయన్నారు. ‘జై శ్రీకృష్ణ’ అంటూ అంబానీ ప్రసంగాన్ని ముగించారు. రిలయన్స్ కేవలం ఒక కంపెనీ కాదు. గర్వించే జాతీయ సంస్థ, భారత ప్రజలకు చెందిన సంస్థ. నేను, నా కుటుంబం, యాజమాన్య బృందంలోని సీనియర్లు ఈ గొప్ప సంస్థకు ట్రస్టీలం మాత్రమే

 -అంబానీ