16-04-2025 12:01:47 AM
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఘన్‌శ్యామ్ ప్రసాద్..
హైదరాబాద్ (విజయక్రాంతి): నిరంతర విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని తెలంగాణ విద్యుత్ సంస్థలకు అందజేస్తామని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) చైర్మన్ ఘన్‌శ్యామ్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఈఏ చైర్మన్ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ -సరఫరా, రిసోర్స్ ప్లాన్, రెన్యువబుల్ విద్యుత్ లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి కావల్సిన తోడ్పాటు, రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ ట్రాన్స్ కో ఎండీ కృష్ణ భాస్కర్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎండీ ముషారఫ్ ఫరూఖీ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎండీ వరుణ్ రెడ్డి, తమ సంస్థల్లో అమలవుతున్న ప్రాజెక్టుల వివరాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలను చైర్మన్‌కు నివేదించారు.
రాష్ట్రంలో గత ఏడాదిన్నర కాలంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని వివరించారు. రైతులకు 24 విద్యుత్ సరఫరా అందించడంతో పాటు, పారిశ్రామిక, గృహ రంగాల్లో అనూహ్యంగా పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్‌ను సమకూర్చడంతో పాటు, గ్రీన్ ఎనర్జీ, ఆర్పీవో లక్ష్యాల సాధనకు విద్యుత్ సంస్థలు కృషి చేస్తున్నాయని వివరించారు. సీఈఏ 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 16,877 మెగావాట్లుగా ఉంటుందని తమ రిసోర్స్ అడిక్వెసీ ప్లాన్‌లో పొందుపర్చారని.. కానీ వాస్తవానికి ఈ ఏడాది మార్చి 20న 17,162 గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైందని ఘన్‌శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ సంస్థల చైర్మన్, ఎండీలతో పాటు, ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రావు, టీజీ రెడ్కో ఎండీ అనిలా, టీజీ ట్రాన్స్ కో, జెన్ కో, టీజీస్పీడీసీల్, ఎన్పీడీసీఎల్ ఇన్‌చార్జి డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.