12-02-2025 02:00:12 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): నైపుణ్య శిక్షణలో బహ్రెయిన్ దేశానికి సహకరిస్తామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. స్కిల్స్ యూనివర్సిటీ, అంకుర సంస్థల ఆవిష్కరణ కేంద్రంగా ఉన్న టీహబ్, టీవర్క్స్ లాంటి సంస్థలను బహ్రెయిన్‌లో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తామన్నారు.
మంగళవారం సచివాలయంలో బహ్రెయిన్ రాయబారి అబ్దుల్ రహమాన్ అల్ గావుద్, బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలిశారు. నైపుణ్య శిక్షణలో తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేయగా.. మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. తనను బహ్రెయిన్ పర్యటనకు రావాల్సిందిగా రాయబారి కోరడంపై శ్రీధర్‌బాబు ధన్యవాదాలు తెలిపారు.
బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులతో ముందుకు రావాలని మంత్రి ఆహ్వానించారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా అపార అవకాశాలున్నాయని తెలిపారు. హైదరాబాద్ నైపుణ్యం ఉన్న ప్రతిభావంతుల కేంద్రమని వివరించారు. ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న వ్యాక్సిన్లలో 40 శాతం హైదరాబాద్‌లో తయారవుతున్నట్లు చెప్పా రు.
ఏఐలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అల్ కూహెజీ, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.