calender_icon.png 26 October, 2024 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్ సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగిస్తాం

08-08-2024 03:34:11 AM

తెలంగాణ సమాజానికి ఆయనొక ఐకాన్

ఓయూలో జరిగిన గద్దర్, జహీర్ అలీఖాన్ వర్ధంతి సభలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ సమాజానికి ఒక ఐకాన్ అని, ఆయన సాంస్కృతిక ఉద్యమాన్ని కొనసాగిస్తామని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కంచర్ల బద్రి, సునీల్‌శెట్టి, సలీంపాషా అధ్యక్షతన గద్దర్, జహీర్ అలీఖాన్‌ల వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రొ.కంచె ఐలయ్య, ప్రొ.కోదండరాం, ప్రొ.కాశీం తదితరులు హాజరయ్యారు. గద్దర్, జహీర్ అలీఖాన్‌కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రొ.కంచె ఐలయ్య మాట్లాడుతూ.. వరంగల్‌లో కడుతున్న కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సాంస్కృతిక, కళా రంగాలను సంపూర్ణంగా విశ్లేషించి ప్రజలకు అందించడంలో గద్దర్ అద్భుతమైన పాత్రను నిర్వహించారని కొనియాడారు. గ్రామాల్లో జరిగే మోసాలు, ఆధిపత్యానికి గద్దర్ పాట ఎదురు నిలిచిందన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ.. పాట అంటే గద్దర్ అనేలా సమాజంలో నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రొ.అన్సారీ, గద్దర్ కుమార్తె వెన్నెల, కుమారుడు సూర్యం, ప్రొ.యాదగిరి, ఏపూరి సోమన్న, వరంగల్ రవి, విద్యార్థి నేతలు దరువు ఎల్లన్న, కోట శ్రీనివాస్, మండల భాస్కర్, దుర్గం భాస్కర్, జంగిలి దర్శన్, నరసింహ, రేష్మ, మురళి, వంశీ పాల్గొన్నారు.