- అనుమతులు ఇచ్చేప్పుడు నిబంధనలు తెలియవా?
- అనుమతులిచ్చాక కూల్చివేత నోటీసులపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని, ఇకపై వారి ఆస్తులను జప్తు చేసేలా ఆదేశాలివ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.
బఫర్‌జోన్ అని తెలిసీ అనుమతులు మంజూరు చేస్తారని, అనుమతులతో ఇళ్లను నిర్మించుకున్నాక వాటిని అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నించింది.
ఆస్తులను జప్తు చేస్తే వాళ్ల తాతలు దిగివస్తారని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నార్కుడ గ్రామ పరిధిలోని మంగర్షికుంట ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ జైశ్వాల్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఈ నెల 4న గోడకు నోటీసులు అతికించారని, ఏడు రోజుల్లో ఎఫ్‌టీఎల్/ బఫర్‌జోన్‌లో నిర్మాణాలను తొలగించాలని పేర్కొన్నారని చెప్పారు.
అను మతులు తీసుకుని నిర్మించుకున్న రేకుల ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నా రని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరంలేదని, అది ప్రజాధనమని, అధికారుల తప్పునకు ప్రభుత్వం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది.
అధికారుల నుంచే రాబట్టాలని, వారి ఆస్తులను జప్తు చేస్తే తాతలు కనిపిస్తారని వ్యాఖ్యానించింది. అధికారులు ఇచ్చిన అనుమతులతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి చెరువులను పరిరక్షణ చేపట్టాలంటూ ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది వాస్తవమేనని తెలిపారు.
అయితే నిబంధనల ప్రకారమే తొలగించాలని స్పష్టంచేశాయని, వాటిని ఉల్లంఘించరాదని పేర్కొన్నాయని తెలిపారు. అక్రమ నిర్మాణాలని తేలినపుడు తగిన నోటీసులు జారీచేసి, వారి వివరణ తీసుకుని చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.
ప్రస్తుత కేసులో ఇరిగేషన్ అధికారులు జారీచేసిన నోటీసులపై పిటిషనర్లు 15 రోజుల్లో అన్ని ఆధారా లు, పత్రాలతో సమాధానం ఇవ్వాలని ఉత్తర్వు లు జారీచేశారు. ఈలోగా నోటీసులపై ఎలాం టి చర్యలు తీసుకోరాదని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణ ను మూసివేశారు.