calender_icon.png 20 April, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీకల్లుపై దర్యాప్తు వేగం

17-04-2025 01:35:58 AM

  1. ఘటనకు బాధ్యులైన 36 మందిపై కేసు నమోదు

కల్తీ కృత్రిమ కల్లును పూర్తిస్థాయిలో అరికడతాం

కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు

కామారెడ్డి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లును అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈనెల 7న జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం దుర్గి, అంకుల్, దామరంచ గ్రామాల్లో కల్తీకల్లు తాగి 80 మందికి పైగా అస్వస్థతకు, ఆ మరుసటి రోజు కూడా గాంధారి మండలం గౌరారంలో 30 మందికి పైగా గ్రామస్తులు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన విషయం విధితమే.

ఈ ఘటనలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీకల్లుపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్, పోలీస్ అధికారులను ఆదేశించారు. దీంతో కల్తీ కల్లును అరికట్టడానికి ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ అధికారులు 6 బృందాలుగా ఏర్పడి కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ శాంపిల్స్ సేకరిస్తున్నాయి.

కల్తీకల్లు విక్రయాలు చేపడుతున్న అనుమతి లేని దుకాణాలను మూసేశారు. కామారెడ్డి జిల్లాలో టీఎఫ్‌టీ లైసెన్స్ ఉన్న కల్లు దుకాణంతోపాటు కల్లు పారిశ్రామిక సహకార సంఘాలున్నాయి. వాటి ద్వారా కల్లును విక్రయిస్తున్నారు. జిల్లాలో కల్తీ కల్లును పూర్తిగా రూపుమాపాలని రాష్ట్ర ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో గత వారం రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కల్తీకల్లు విక్రయాలను నిలిపివేశారు. ఈనెల 7న జరిగిన ఘటనకు సంబంధించి 36 మందిపై కేసులు నమోదు చేశారు. ముందుగా ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ ఘటనలో బాధ్యులైన మరో 30 మందిని అరెస్టు చేసి, కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. మరో 40 కొత్త కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 

జిల్లావ్యాప్తంగా 184 కల్లు దుకాణాలను తనిఖీ చేపట్టగా 159 దుకాణాల్లో శాంపిల్స్ సేకరించి ఉన్నతాధికారులకు పంపించినట్టు తెలిపారు. 41 వంద లీటర్ల కల్తీకల్లును ధ్వంసం చేసినట్టు కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు విజయక్రాం తితో తెలిపారు.